సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది! ఫలితం అనుభవిస్తోంది

23 Feb, 2022 16:09 IST|Sakshi

ఫిన్‌టెక్‌ రంగంలో భారత్‌పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్‌ డైరెక్టర్‌ అష్నీర్‌ గ్రోవర్‌, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. 

అష్నీర్‌కు తాజాగా గట్టి షాక్‌ ఇచ్చింది భారత్‌పే. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్‌ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్‌టం చేసింది. 

మాధురీ జైన్‌.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్‌ సామాన్లు, అమెరికా.. దుబాయ్‌కి ఫ్యామిలీ ట్రిప్స్‌ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్‌ అండ్‌ మార్షల్‌ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. 

ఇదిలా ఉండగా.. అష్నీర్‌ గ్రోవర్‌ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్‌ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం.

సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ!

మరిన్ని వార్తలు