ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేశారా!..చేయకపోతే..!

28 Mar, 2022 08:46 IST|Sakshi

అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్‌ ఉంది. త్వరపడండి. 

వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. 

► అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్‌ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. 

► ఇక ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్లు.. సేవింగ్స్‌.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు ..సేవింగ్స్‌..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్‌ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్‌లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్‌ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. 

► ఇక నాలుగోది.. పాన్‌తో ఆధార్‌ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్‌ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్‌షిప్, గ్యాస్‌ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి.  దీన్ని పాటించకపోతే సెక్షన్‌ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్‌ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం.

మరిన్ని వార్తలు