వీడియో: ఖరాబు అయితే టెస్లా కారు గతి ఇంతేనా? మస్క్‌.. జర జాగ్రత్త!

20 Dec, 2021 10:03 IST|Sakshi

Tesla Car Exploding Broken Down Video: టెస్లా.. ప్రపంచంలోనే ఆటోమొబైల్‌ దిగ్గజంగా పేరున్న అమెరికన్‌ కంపెనీ. ముఖ్యంగా ఈవీ సెక్టార్‌ ఆవిష్కరణలతో, కొత్త సాంకేతికతను ప్రొత్సహిస్తూ ఆటో సెక్టార్‌లో సంచలనాలకు నెలవైంది. అలాంటి కంపెనీ ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌ చైనాలో అడుగుపెట్టగా.. ఇప్పుడు భారత్‌పై కన్నేసింది. అయితే ఈ కంపెనీ కార్లు రకరకాల సమస్యలతో వార్తల్లోకి కూడా ఎక్కుతుంటాయి. 


ఎలన్‌ మస్క్‌ సారథ్యంలోని టెస్లా వాహనాలకు ఎంత మంచి ఫీడ్‌ బ్యాక్‌ ఉంటుందో.. ఒక్కోసారి అంతే వరెస్ట్‌ ఫీడ్‌బ్యాక్‌ కూడా వాహనదారుల నుంచి వస్తుంటుంది. తాజాగా ఓ టెస్లా వాహనదారుడు ఒకరు ఏకంగా టెస్లా కారును పేల్చేశాడు. అదీ 30 కేజీల డైనమైట్‌ సాయంతో. అందుకు కారణం దానిని రిపేర్‌ చేయించుకునే స్తోమత అతనికి లేకపోవడమే!. 

ఫిన్లాండ్‌ దక్షిణ ప్రాంతానికి చెందిన కైమెన్‌లాక్సో రీజియన్‌లో జాలా అనే చిన్న ఊరు ఉంది. మంచుతో కప్పబడిన ఈ ప్రాంతంలో తాజా ఘటన చోటు చేసుకుంది. టెస్లా మోడల్‌ ఎస్‌(2013)కు ఓనర్‌ టువోమాస్‌ కటాయినెన్‌. 1500 కి.మీ. తిరిగిన తర్వాత కారు కోడ్‌లో ఎర్రర్‌లు రావడం మొదలైంది. దీంతో సర్వీస్‌ స్టేషన్‌కు తరలించగా.. రిపేర్‌ తమ వల్ల కాదని, మొత్తం బ్యాటరీ సెల్‌ను మార్చేయాలని సూచించారు. అందుకు 20 వేల యూరోలు(మన కరెన్సీలో 17 లక్షలపైనే) ఖర్చు అవుతుందని చెప్పారట. దీంతో కారును బాగు చేయంచడం కంటే.. నాశనం చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు టువోమాస్‌. 

ఊరికి దూరంగా మంచుకోండల్లోకి తీసుకెళ్లి.. కారును పేల్చేసే ప్లాన్‌ చేశాడు. ఇందుకు స్థానిక ప్రభుత్వ సిబ్బందితో పాటు యూట్యూబ్‌ ఛానెల్‌ పొమ్మిజట్‌కట్‌(Pommijatkat) సాయం చేసింది. డైనమైట్‌లను అమరుస్తున్న టైంలో ఇంతలో పైన ఓ హెలికాఫ్టర్‌ వచ్చింది. దాని నుంచి ఓ దిష్టిబొమ్మను కిందకు దించారు. అది టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ దిష్టిబొమ్మ. ఆ బొమ్మను డ్రైవర్‌ సీట్లో కూర్చోబెట్టి, సిబ్బంది అంతా దూరంగా పరిగెత్తి.. బంకర్‌లో దాక్కున్నారు.  కాసేపటికే ఆ కారు భారీ విస్పోటనంతో పేలి ముక్కలైపోగా.. ఆనవాలు లేకుండా పోయింది.  

ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రకరకాల యాంగిల్స్‌లో, ఎఫెక్ట్స్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ బ్లాస్ట్‌తో అక్కడున్నవాళ్లంతా తెగ ఎంజాయ్‌ చేశారు. బహుశా ప్రపంచంలో టెస్లా కారును ఇలా ముక్కలు చేసిన తొలి ఘనత  టువోమాస్‌కే చెందుతుందేమో!. దీనికి మస్క్‌ స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి.

హెచ్చరికేనా?.. ఈ మధ్యకాలంలో టెస్లా కారులు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఘటనలో ఏకంగా ఎలన్‌ మస్క్‌ దిష్టిబొమ్మను పెట్టిన పరిణామం.. వాహన దారుడిలో ఎంత మంట పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ  వీడియోపై ఎలన్‌ మస్క్‌కు టెక్‌ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈవీ వెహికిల్స్‌ మార్కెట్‌ విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు.. కొత్త వాహనదారులను వెనకడుగు వేసేలా చేస్తుందని, ఆ సమస్యల పరిష్కారానికి తగు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. 

చదవండి: ఎలన్‌మస్క్‌కు ఊహించని దెబ్బ

మరిన్ని వార్తలు