Parag Agrawal పరాగ్‌ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?

28 Oct, 2022 12:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్‌,  ఎలాన్‌ మస్క్‌  మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ డీల్‌ను పూర్తి చేసిన వెంటనే కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేయడం సంచలనం సృష్టించింది. 44 బిలియన్‌ డాలర్ల  (సుమారు రూ.3.37 లక్షల కోట్లు)టేకోవర్‌ డీల్‌  తరువాత  ట్విటర్‌ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె తొలగింపు తర్వాత భారీ మొత్తం అందుకోబోతున్నారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌కు సుమారు 42 మిలియన్‌ డాలర్ల అత్యధిక చెల్లింపును అందుకోబోతోన్నారు.  మొత్తంగా తొలగించిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు  88 మిలియన్‌ డాలర్లు  చెల్లించాల్సి ఉంటుంది.  

పరిశోధనా సంస్థ ఈక్విలర్ ప్రకారం, 42 మిలియన్లు డాలర్లు (రూ.3,457,145,328) పరాగ్‌ అగర్వాల్‌ సొంతం చేసుకుంటారు.  పరాగ్‌ వార్షిక బేసిక్‌ సాలరీ, ఈక్విటీ అవార్డు ప్రకారం దీన్ని అంచనా వేసింది. అలాగే కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్‌మెంట్‌ నిబంధనల మేరకు ఈ పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్‌ అంచనా వేసింది. ఇన్‌సైడర్ ప్రకారం మాజీ సీఎఫ్‌వోకు  25.4 మిలియన్‌ డాలర్లు,  చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్  సారా పెర్సోనెట్ 11.2 మిలియన్ల డాలర్లు పొందుతారు.

దశాబ్దం క్రితం ట్విటర్‌లో పరాగ్‌  ఎంట్రీ
ఐఐటీ బాంబే , స్టాన్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థి పరాగ్‌ అగర్వాల్‌ 2011లో ట్విటర్‌లో చేరారు. 2017 నుంచి ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసరుగా ఉన్న ఆయననకు గత ఏడాది నవంబరులో సీఈవో నియమించింది  కంపెనీ. 2021 నాటికి పరాగ్‌ మొత్తం పరిహారం $30.4 మిలియన్లు

కాగా ట్విటర్‌ స్వాధీనం తరువాత  ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ సిబ్బందిలో  75 శాతం లేదా 5,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలో నివేదికలు పేర్కొన్నాయి. ట్విటర్‌  పునర్వ్యవస్థీకరణతోపాటు, ఉద్యోగులపై  వేటు తప్పదనే అంచనాలొచ్చాయి.  అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ట్విటర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్భించిన సందర్బంగా  మస్క్‌  ట్విటర్ ఉద్యోగులతో  హామీ ఇచ్చారు.  అయితే మస్క్‌ టేకోవర్‌, కీలక ఉద్యోగులపై వేటు తరువాత  ఉద్యోగులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు