బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్..హీరో-హార్లే బైక్‌ వచ్చేస్తోంది

28 Nov, 2022 07:37 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, ప్రీమియం మోటర్‌సైకిల్స్‌ సంస్థ హార్లే–డేవిడ్‌సన్‌ సంయుక్తంగా రూపొందించే బైక్‌ రాబోయే రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హీరో దీన్ని ప్రవేశపెట్టనుంది. హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌వో నిరంజన్‌ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకుంటున్నామని, ఏటా ఈ విభాగంలో కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టనున్నామ­ని ఆయన పేర్కొన్నారు. 

భారత మార్కెట్లో హార్లే–డేవిడ్‌సన్‌ వాహనలకు సంబంధించి 2020 అక్టోబర్‌లో ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హార్లే–డేవిడ్‌సన్‌ బ్రాండ్‌ పేరిట హీరో మోటోకార్ప్‌ భారత్‌లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల అభివృద్ధి, విక్రయాలు చేపట్టనుంది. అలాగే ఆయా బైక్‌లకు అవసరమైన సర్వీసింగ్, విడిభాగాల సరఫరా కూడా హీరో చేపట్టనుంది. 

100–110సీసీ బడ్జె­ట్‌ బైక్‌ల విభాగంలో ఆధిపత్యం ఉన్న హీరో .. 160సీసీ ఆ పై విభాగాల్లోనూ అమ్మకాలను పెంచుకోవడం ద్వారా లాభదాయకతను మెరు­గుపర్చుకునే యోచనలో ఉంది. గడిచిన కొద్ది త్రైమాసికాలుగా విడిభాగాలు, యాక్సెసరీలు, మర్చండైజ్‌ (పీఏఎం) వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా చెప్పా­రు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఏ­ఎం వ్యాపార ఆదాయం 45 శాతం వృద్ధి చెంది రూ. 2,300 కోట్లుగా నమోదైనట్లు వివరించారు.   

మరిన్ని వార్తలు