126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి..

1 Dec, 2020 10:48 IST|Sakshi

బాటా గ్లోబల్‌కు తొలి దేశీ సీఈవో

బాధ్యతలు స్వీకరించనున్న సందీప్‌ కటారియా

126 ఏళ్ల కంపెనీ చరిత్రలో తొలి భారత సీఈవో

ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా బాధ్యతలు

సందీప్‌ నేతృత్వంలో రెట్టింపైన నికర లాభాలు

ముంబై, సాక్షి: ఫుట్‌వేర్‌ దిగ్గజం బాటా గ్రూప్‌ గ్లోబల్‌ సీఈవోగా తొలిసారి ఒక భారతీయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్‌ కటారియా ఇందుకు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు బాటా గ్రూప్‌నకు సేవలందించిన చీఫ్‌ అలెగ్జిస్‌ నసార్డ్‌ నుంచి బాటా గ్లోబల్‌ పగ్గాలను సందీప్‌ అందుకోనున్నారు. తద్వారా 126 ఏళ్ల చరిత్ర కలిగిన బాటా గ్రూప్‌ను నడిపించనున్న తొలి భారత సీఈవోగా నిలవనున్నారు. వెరసి దిగ్గజ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న సుప్రసిద్ధ దేశీ సీఈవోల సరసన సందీప్‌ చోటు సాధించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఇంటర్నెట్‌ దిగ్గజం అల్ఫాబెట్‌కు సుందర్‌ పిచాయ్‌, మాస్టర్‌కార్డ్‌కు అజయ్‌ బంగా, ఐబీఎంకు అరవింద్‌ కృష్ణ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ రెకిట్‌ బెంకిసర్‌కు లక్ష్మణ్‌ నారాయణ్‌, నోవర్తిస్‌కు వసంత్‌ నారాయణ్ సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.  

బ్యాక్‌గ్రౌండ్‌ 
బాటా గ్లోబల్‌కు సీఈవోగా ఎంపికైన 49ఏళ్ల సందీప్‌ ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. 1993 పీజీడీబీఎం బ్యాచ్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌గా నిలిచారు. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్‌, యుమ్‌ బ్రాండ్స్‌, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌, టేకో బెల్‌, వొడాఫోన్‌ కంపెనీలలో 24 ఏళ్లపాటు పనిచేసిన సందీప్‌ దేశీ యూనిట్‌ బాటా ఇండియాకు 2017లో సీఈవోగా చేరారు. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు కలిగిన బాటా గ్లోబల్‌కు దేశీ మార్కెట్‌ అత్యంత కీలకంగా నిలుస్తోంది. సందీప్‌ నేతృత్వంలో బాటా ఇండియా అమ్మకాలు రెండంకెల్లో వృద్ధి చూపగా.. నికర లాభాలు రెట్టింపయ్యాయి. యువతపై దృష్టిపెట్టడం, బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా అమ్మకాలు పెంచుతూ వచ్చారు. గతేడాది బాటా ఇండియా అమ్మకాలు రూ. 3,053 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 327 కోట్లను తాకింది. గత కొన్నేళ్లుగా తీవ్ర పోటీలోనూ బాటా ఇండియా అత్యున్నత ఫలితాలను సాధించినట్లు కంపెనీ చైర్మన్‌ అశ్వని విండ్‌లేస్‌ పేర్కొన్నారు. సందీప్‌ కార్యాచరణలో బాటా గ్రూప్‌, బాటా ఇండియా ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడినట్లు తెలియజేశారు. 1934లో దేశీయంగా ఏర్పాటైన బాటా ఇండియా(బాటా షూ కంపెనీ) మధ్యతరగతి ప్రజల జీవనంలో భాగమైన బ్రాండుగా గుర్తింపును పొందినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

బాటా గ్రూప్‌
1894లో టొమస్‌ బాటా అధ్యక్షతన స్విట్జర్లాండ్‌లో ఆవిర్భవించిన బాటా గ్రూప్‌ అమ్మకాల పరిమాణంరీత్యా ప్రపంచంలోని టాప్‌ కంపెనీగా నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వార్షికంగా 5,800 స్టోర్ల ద్వారా 18 కోట్ల బూట్ల జతలను విక్రయిస్తోంది. ఐదు ఖండాలలో 22 సొంత తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. 35,000 మందికిపైగా సిబ్బందిని కలిగి ఉంది.

మరిన్ని వార్తలు