మేడిన్‌ ఇండియా ఈ-చిప్‌: 2024 చివరికల్లా మార్కెట్‌లోకి..

24 Jun, 2023 13:29 IST|Sakshi

ఏడాదిలోపు నాలుగైదు సెమీకండక్టర్‌ ప్లాంట్ల ఏర్పాటు

కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌

న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన (మేడ్‌ ఇన్‌ ఇండియా) తొలి ఈ–చిప్‌లు 2024 డిసెంబర్‌ నాటికి మార్కెట్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ ప్రకటించారు. ఏడాదిలోపు నాలుగు నుంచి ఐదు వరకు సెమీకండక్టర్‌ ప్లాంట్‌లు దేశంలో ఏర్పాటు కావొచ్చని చెప్పారు. అమెరికాకు చెందిన కంప్యూటర్‌ మెమొరీ చిప్‌ తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీస్‌ 2.75 బిలియన్‌ డాలర్ల వ్యయంతో గుజరాత్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు.

ఈ ప్లాంట్‌కు అనుసంధానంగా 200 చిన్న యూనిట్లు కూడా ఏర్పాటు అవుతాయని మంత్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన అనంతరం అశ్వని వైష్ణవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. మైక్రాన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి పన్ను నిబంధనలు, ఫ్యాక్టరీ డిజైన్, భూ కేటాయింపులపై ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపారు. మైక్రాన్‌ టెక్నాలజీస్‌ నుంచి మొదటి చిప్‌ ఆరు త్రైమాసికాల తర్వాత మార్కెట్లోకి వస్తుందన్నారు.

మైక్రాన్‌ ఏర్పాటు చేసే 2.75 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంస్థ సొంతంగా రూ.825 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనుండడం గమనార్హం. ఈ ప్లాంట్‌తో మొత్తం 20వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం విలువ బిలియన్‌ డాలర్ల మేర ఉంటుందని అశ్వని వైష్ణవ్‌ తెలిపారు.

సెమీకండక్టర్‌ పథకం సవరణ 
సెమీకండక్టర్‌ పథకాన్ని సవరించామని, కనుక గతంలో దరఖాస్తు చేసిన సంస్థలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. లేదా దరఖాస్తులు సవరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. సవరించిన పథకం కింద సెమీకండక్టర్‌ ప్లాంట్‌ వ్యయంలో 50 శాతాన్ని కేంద్రమే ద్రవ్య ప్రోత్సాహకం కింద సమకూరుస్తోంది. గతంలో ఇది 30 శాతంగానే ఉండేది.

మరిన్ని వార్తలు