ఫస్ట్‌మెరీడియన్‌ ఐపీవోకు సెబీ ఆమోదం

7 Nov, 2022 09:01 IST|Sakshi

న్యూఢిల్లీ: మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ ఫస్ట్‌మెరీడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర లభించింది. దీనికి సంబంధించి అక్టోబర్‌ 18న అబ్జర్వేషన్‌ లెటర్‌ అందినట్లు సంస్థ తెలిపింది. ఈ లెటర్‌ను పబ్లిక్‌ ఇష్యూకు గ్రీన్‌ సిగ్నల్‌గా పరిగణిస్తారు.

 ఐపీవో ద్వారా ఫస్ట్‌మెరీడియన్‌ రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 50 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మిగతా రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో విక్రయించనున్నారు. ప్రాస్పెక్టస్‌ ముసాయిదా ప్రకారం ప్రమోటర్‌ అయిన మ్యాన్‌పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ రూ. 665 కోట్ల షేర్లు, ప్రస్తుత వాటాదారులు న్యూ లేన్‌ ట్రేడింగ్‌ రూ. 45 కోట్లు, సీడ్‌త్రీ ట్రేడింగ్‌ రూ. 40 కోట్ల షేర్లను విక్రయిస్తాయి.

 కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా వచ్చే నిధులను రుణాలు తీర్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 2018లో ఏర్పడిన ఫస్ట్‌మెరీడియన్‌కు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్, డెల్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ ఇండియా. ఫోన్‌పే, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ మొదలైనవి క్లయింట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 శాఖలు ఉండగా, 75 పైగా నగరాల్లో రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,110 కోట్ల ఆదాయం నమోదు చేసింది.   


 

మరిన్ని వార్తలు