Fitch Ratings: భారత్‌ ఎకానమీ అంచనాలకు కోత

8 Jul, 2021 15:10 IST|Sakshi

2021–22 ఆర్థిక సంవత్సరం భారత్‌ ఎకానమీ అంచనాలకు కోత 

ఫిచ్‌ రేటింగ్స్‌ తాజా సమీక్ష గతంలో 12.8 శాతం అంచనా

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ వృద్ధి అంచనాలను 10 శాతానికి కుదిస్తున్నట్లు రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. గతంలో ఇది 12.8 శాతంగా ఉంటుందని ఫిచ్‌ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వల్ల బ్యాంకింగ్‌ రంగానికి సవాళ్లు మరింతగా పెరిగాయని తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. స్థానికంగా లాక్‌డౌన్‌లు విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు .. పూర్వ స్థాయికి పడిపోకుండా కాస్త ఊతం లభించిందని వివరించింది. అయితే, కీలకమైన పలు వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల రికవరీ ప్రక్రియ మందగించిందని ఫిచ్‌ తెలిపింది.

2019–20లో 4 శాతంగా ఉన్న భారత్‌ వృద్ధి రేటు .. కోవిడ్‌–19 మొదటి దశ వ్యాప్తి తరుణంలో 2020–21లో 7.3 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండవచ్చని ముందుగా అంతా అంచనా వేసినప్పటికీ, కరోనా సెకండ్‌ వేవ్‌ రాకతో పరిస్థితి మారిపోయింది. ఆర్‌బీఐ ఇటీవలే తమ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. మూడీస్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది 9.3 శాతం–9.5 శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు ఏకంగా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కుదించింది.  

టీకా ప్రక్రియ కీలకం.. 
టీకాల ప్రక్రియ వేగం పుంజుకుంటే వ్యాపార వర్గాలు, వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్‌ వెల్లడించింది. అయినప్పటికీ తదుపరి కరోనా ఉధృతి మరింత పెరిగినా, లాక్‌డౌన్‌లు విధించిన ఆర్థిక వ్యవస్థ రికవరీకి సవాళ్లు ఎదురు కావచ్చని పేర్కొంది. ‘2021 జూలై 5 నాటికి 137 కోట్ల జనాభాలో 4.7 శాతం ప్రజలకు మాత్రమే టీకా ప్రక్రియ పూర్తయ్యింది. అర్థవంతమైన, నిలకడైన ఆర్థిక రికవరీ సాధనకు దీనివల్ల రిస్కులు పొంచి ఉన్నాయి‘ అని ఫిచ్‌ వివరించింది.

ఫలితంగా, బ్యాంకుల మధ్యకాలిక పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొంది. వ్యాపార, ఆదాయ వృద్ధికి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల బ్యాంకులకు పరిస్థితి సమస్యాత్మకంగా ఉండవచ్చని తెలిపింది. మరోవైపు, ’బీబీబీమైనస్‌’ రేటింగ్‌ గల ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కాస్త మెరుగ్గానే ఉండవచ్చని, కానీ కరోనా గాయాల కారణంగా మధ్యకాలికంగా వ్యాపార వర్గాలు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనపడే రిస్కులు ఉన్నాయని ఫిచ్‌ తెలిపింది.  

>
మరిన్ని వార్తలు