-

భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు..తగ్గనున్న వినియోగం..!

20 Apr, 2022 08:57 IST|Sakshi

వినియోగ వృద్ధి 5 శాతానికి పరిమితం

ఇంతక్రితం 7 శాతం అంచనా

ఫిచ్‌ రేటింగ్స్‌ నివేదిక  

న్యూఢిల్లీ: అధిక ధరల నేపథ్యంలో భారత్‌ గ్యాస్‌ వినియోగంలో వృద్ధి తగ్గనుందని రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గ్యాస్‌ వినియోగ వృద్ధి 5 శాతానికి పరిమితం అవుతుందని వివరించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. దేశీయ గ్యాస్‌ ధరలలో ఇటీవలి పెరుగుదల అధిక ఎన్‌ఎన్‌జీ రేట్ల వంటి అంశాలు వినియోగదారుల ధోరణిలో మార్పును తీసుకువస్తాయని, పర్యావరణ అనుకూల ఇంధనం వైపునకు వారు దృష్టి సారించేలా చేస్తాయని నివేదిక అభిప్రాయపడింది.

దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఏప్రిల్‌కు ముందు ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిచ్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక ఇచ్చింది.  

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

  • దేశీయ గ్యాస్‌ ధరలు, అధిక ఎల్‌ఎన్‌జీ ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో సహజ వాయువు వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  5 శాతం వృద్ధికి పరిమితమవుతుందని మేము భావిస్తున్నాము (2021–22లో ఈ వినియోగ అంచనా 6.5 శాతం). ఇది క్రితం అంచనా 7 శాతంకన్నా తక్కువ.  దేశీయ గ్యాస్‌ ఉత్పత్తి ప్రస్తుత వినియోగంలో దాదాపు సగం ఉంది.  మిగిలినది ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రూపంలో దిగుమతి అవుతోంది.  
  • ప్రభుత్వ రంగ గ్యాస్‌ యుటిలిటీ గెయిల్‌ (ఇండియా)కు తన సహజ వాయువు మార్కెటింగ్‌ సెగ్మెంట్‌ నుండి వచ్చే ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో స్పాట్‌ ఎల్‌ఎన్‌జీ ధరలు (అమెరికా నుండి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఎల్‌ఎన్‌జీ ధర కంటే అధికంగా) భారీగా పెరగడం దీనికి కారణం. అయితే అధిక ఎల్‌ఎన్‌జీ ధరలు భారతదేశంలో గ్యాస్‌ వినియోగ వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయి.  
  • 2021–22, 2022–23లో బలమైన లాభదాయకత గెయిల్‌ వాటాదారుల రాబడుల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. అయితే గెయిల్‌ ఆర్థిక క్రెడిట్‌ ప్రొఫైల్‌ ’బీబీబీ’కి అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం.  
  • ఏడాది ఏప్రిల్‌లో రూ. 1,080 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు గెయిల్‌ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.  

పెట్రోల్, డీజిల్‌ నష్టాలు భర్తీ... 
కాగా, ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) పెట్రోలు,  డీజిల్‌ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మార్కెటింగ్‌ నష్టాలను చవిచూడవచ్చని ఫిచ్‌ అభిప్రాయపడింది.  అయితే బలమైన  రిఫైనింగ్‌ మార్జిన్లు,  భారీ ఇన్వెంటరీ లాభాలు ఈ నష్టాలను భర్తీ చేస్తాయని ఫిచ్‌ అంచనావేసింది.

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 27 డాలర్లు (లీటరకు రూ.13)  పెరిగినప్పటికీ, సంబంధిత మూడు ఇంధన రిటైలర్లు నవంబర్‌ 2021 నుంచి మార్చి 2022 మధ్య రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్‌ ధరలను మార్చకుండా యథాతథంగా కొనసాగించిన విషయాన్ని ఫిచ్‌ తాజా నివేదిక ప్రస్తావించింది.  మూడు కంపెనీలు మార్చి 22 నుండి 16 రోజుల పాటు లీటరుకు రూ. 10 చొప్పున పెంచాయి. దేశీయ మార్జిన్లు ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ప్రైవేట్‌ ఇంధన రిటైలర్లు ఎగుమతులను మెరుగైన మార్జిన్లతో పెంచుకుంటారని భావిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. భారతదేశం డీజిల్‌ ఎగుమతి ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో 2021 ఇదే కాలంతో పోల్చితే 12 శాతం పెరిగింది.  

చదవండి: అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!

మరిన్ని వార్తలు