అరుదైన సర్జరీ.. ఐదు కిడ్నీలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

12 Aug, 2021 09:03 IST|Sakshi

ఆయనకి శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. యస్‌.. తనవి రెండు.. దాతలు ఇచ్చినవి మూడు.  గతంలో రెండుసార్లు అవయవ మార్పిడి చికిత్సలు నిర్వహించిన వైద్యులు.. ఈమధ్యే విజయవంతంగా మరో కిడ్నీని శరీరంలోకి ఎక్కించారు. ఇంతకు ముందు సర్జరీలు ఫేయిల్‌ కావడానికి కారణం.. ఆయనకు ఉన్న హైపర్‌టెన్షన్‌(అధిక రక్తపోటు) సమస్య. దీంతో మరోసారి ప్రయత్నించిన డాక్టర్లు.. సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు. తద్వారా  వైద్య చరిత్రలో అరుదైన ఈ ఘటనకు చెన్నై వైద్యులు కారణం అయ్యారు. 

తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్‌ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్‌కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్‌ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి.. 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. ఆయనకు ఉన్న అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. దీంతో coronary artery disease బారినపడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్‌ మెడికల్‌ మిషన్‌ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్‌ ఉన్న కండిషన్‌కి ఆ ఆప్షన్‌ తప్ప మరొకటి కనిపించలేదు.
 
ఇది చదవండి: పాములే ఇక సైంటిస్టులకు దిక్కు

ఎక్కడ అమర్చారంటే.. 
సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు.  కానీ, ఈ పేషంట్‌కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్‌ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్‌ నుంచి యాంటీబాడీస్‌ రిలీజ్‌ అయ్యే రిస్క్‌ ఏర్పడొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా కిడ్నీని అమర్చాలని ఫిక్స్‌ అయ్యారు. చివరకు పొత్తికడుపు కుహరం దగ్గర ఆ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్‌ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. 

పాతవి తీయకపోవడానికి కారణం ఇదే
కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను ఎందుకు తొలగించలేదని చాలామందికి అనుమానం కలగవచ్చు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా.. నెల తర్వాత (ఆగస్టు 10న) ఆ పేషెంట్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు