దూసుకుపోతున్న వైజాగ్.. ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్టులో వెల్లడైన వాస్తవాలు

19 Sep, 2022 16:41 IST|Sakshi

ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు

కోవిడ్‌ తర్వాత విశాఖ, సూరత్, కోయంబత్తూర్‌వైపే మొగ్గు

బెంగళూరు, చెన్నైలను మించి దూసుకుపోతున్న వైజాగ్‌

విశాఖలో 2018–19లో 4.9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

2021–22లో మాత్రం 11.3 శాతానికి ఎగబాకిన ధరలు

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్‌–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్, ఇతర నగరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన సర్వేలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నైలను మించి ఇళ్ల ధరలు విశాఖలో పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తర్వాత అమ్మకాలు పెరగడం విశేషం.  


సాక్షి, విశాఖపట్నం :
అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందనే అభిప్రాయం ఉంది. అవకాశం వస్తే.. విశాఖలోనే నివసించాలని కోరుకునేవారు లక్షల్లో ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్‌ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్‌ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. తాజాగా ఎస్‌బీఐ ఎకనమిక్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించిన సర్వేలో నివాసానికి అనువైన నగరాల్లో టైర్‌–2 సిటీలు మెట్రో సిటీలకంటే ముందు వరుసలో ఉన్నాయని తేల్చి చెప్పింది. 


ద్వితీయ శ్రేణి నగరాలపైనే ఆసక్తి 

మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్‌గా భావించేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు మెట్రో నగరాలంటే వెగటు పుట్టే స్థాయికి చేరుకుంటోంది. ఎందుకంటే.. పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్నవయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్‌–2, టైర్‌–3 సిటీస్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలవైపు ఆసక్తి చూపుతున్నారు.

మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనంగా మారింది. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ.. విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది. 


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తర్వాత జోరు 

కోవిడ్‌ కారణంగా పని విధానంలో మార్పులు రావడం.. చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ద్వారా పనిచేయడంతో ఈ మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హైబ్రిడ్‌ మోడల్‌కు షిఫ్ట్‌ అవుతున్నాయని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా క్రమంగా పెరగడం.. లివింగ్‌ కాస్ట్‌ ఈ నగరాల్లో తక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో సిటీల నుంచి ఇతర సిటీలకు మారుతున్నారని పేర్కొంది. కొత్త ఇల్లు కొనేందుకు పెద్ద నగరాలతో పోలిస్తే.. టైర్‌–2 నగరాల్లో ధరలు కాస్తా తక్కువ ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. డిమాండ్‌ క్రమంగా పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ ట్రెండ్‌ కూడా విస్తరించడం.. ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి:  స్టార్టప్‌లకు ‘కల్పతరువు’)


బెంగళూరును మించి ఆసక్తి...

దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే టైర్‌ 2, 3 సిటీల్లో ఇళ్ల రేట్లు వేగంగా పెరుగుతున్నాయని ఎస్‌బీఐ సర్వే తెలిపింది. బెంగళూరు, కోల్‌కతా, పూణే వంటి మెట్రోలతో పోలిస్తే విశాఖపట్నం, లక్నో, రాయ్‌పూర్, సూరత్, వడోదరా, జైపూర్, గౌహతి, డెహ్రాడూన్‌ వంటి ద్వితీయ శ్రేణి, కోయంబత్తూర్, నోయిడా వంటి టైర్‌–3 నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

బెంగళూరు, ముంబై, పూణె, కోల్‌కతా కంటే ఎక్కువగా విశాఖపట్నంలో నివసించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటం విశేషం. బెంగళూరులో  2018–19లో ఇళ్ల ధరలు 8.7 % పెరగగా, 2019–20 లో పెద్దగా మార్పు కనిపించలేదు. అదే 2020–21లో 6.2 శాతం, 2021–22 లో కేవలం 3.3 % మాత్రమే పెరిగాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం 2018–19 లో 4.9 %, 2019–20 లో 10.3 % పెరిగాయి. 2020–21 కోవిడ్‌ కారణంగా 2.5 % తగ్గినా, 2021–22 లో మాత్రం 11.3 % పెరగడం చూస్తే.. విశాఖపట్నంలో నివసించేందుకు ఎందరు ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. (క్లిక్: విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్‌ డిమాండ్‌)


ఆహ్లాదకరమైన వాతావరణానికే ఓటు.. 

టైర్‌–2 నగరాల్లో నివసించేందుకు ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసమే కాకుండా.. సరికొత్త జీవన సరళికీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన వ్యయం కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్వాలిటీలన్నీ ఉన్న నగరాల్లో విశాఖ ముందు వరసలో ఉంటోంది. అందుకే విశాఖ వంటి నగరాలకు డిమాండ్‌ పెరిగింది. పరిపాలన రాజధానిగా భాసిల్లుతున్న నేపథ్యంలో డిమాండ్‌ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరమే అయినా.. మహా నగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకోవడం వల్లనే డిమాండ్‌ ఉంది.                
– కె.ఎస్‌.ఆర్‌.కె.సాయిరాజు, క్రెడాయ్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు