కోవర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ రెండింతలు

22 Jun, 2022 06:20 IST|Sakshi

2021–22లో 90,200 డెస్క్‌ల లీజు

2020–21లో 37,300 సీట్లకే డిమాండ్‌

జేఎల్‌ఎల్‌ ఇండియా, క్యూడెస్క్‌ నివేదిక

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ రెండింతలు అయ్యి 90,200 డెస్క్‌లుగా ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా, క్యూడెస్క్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ఏడు ప్రధాన పట్టణాల్లో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్‌ స్పేస్‌ డిమాండ్‌ 37,300 సీట్లుగా ఉంది. కార్యాలయ స్థలాన్ని పంచుకోవడమే కో వర్కింగ్‌ స్పేస్‌. ఒక్కరు విడిగా లేక ఇతరులతో కలసి ఉమ్మడిగా పనిచేసుకునే వేదిక. హైదరాబాద్‌ మార్కెట్లో కోవర్కింగ్‌ స్పేస్‌ డిమాండ్‌ 2021–22లో 11,312 డెస్క్‌లు (కూర్చుని పనిచేసే స్థానాలు)గా ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 15,659, ముంబైలో 14,900 డెస్క్‌లుగా ఉన్నట్టు ఈ నివేదిక    తెలిపింది.   

సానుకూలతలు..
డిమాండ్‌కు తగ్గట్టు సేవలను కాంట్రాక్టుకు ఇచ్చేందుకు కంపెనీలు మొగ్గు చూపిస్తుండడం కోవర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ అధికం కావడానికి కారణమని ఈ నివేదిక తెలిపింది. స్వల్పకాలం పాటు లీజుకు తీసుకునే వెసులుబాటు, పూర్తి స్థాయి సేవలు, సౌకర్యాలు కోవర్కింగ్‌ స్పేస్‌కు అనుకూలతలుగా పేర్కొంది. 2021–22లో 62 శాతం డెస్క్‌లు ఆఫీస్‌ స్పేస్‌ కోసం వినియోగమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 52 శాతంగా ఉంది. సంస్థలు పెరుగుతుండడమే ఈ విభాగంలో కోవర్కింగ్‌ స్పేస్‌ వినియోగం పెరగడానికి కారణంగా ఈ నివేదిక తెలిపింది. 2021–22లో మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో సగానికి పైన.. 300 సీట్లు అంతకుమించి లావాదేవీలు ఉన్నాయి. మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో 60 శాతాం వాటాను       బెంగళూరు, పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ నగరాలు ఆక్రమిస్తున్నాయి.  

చార్జీలు..  
కోవర్కింగ్‌ స్పేస్‌ భవనాల్లో ఒక్కో సీటుకు నెలవారీగా లీజు రూ.6,300 నుంచి రూ.14,300 మధ్య ఉంది. అయితే, ముంబై, ఢిల్లీ వంటి పట్టణాల్లోని కీలక ప్రాంతాల్లో ఉన్న కోవర్కింగ్‌ స్పేస్‌ భవనాల్లో ఒక్కో సీటుకు లీజు రేట్లు అధికంగా ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ముంబైలో ఇది రూ.50,000 వరకు ఉంటే, ఢిల్లీలో రూ.25,000–45,000 మధ్య ఉంది. టైర్‌–2 పట్టణాల్లో ఒక్కో సీటు రూ.4,000–6,800 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా టైర్‌–1, టైర్‌–2 పట్టనాల్లో రూ.3,000 వరకు కోవర్కింగ్‌ సదుపాయ కేంద్రాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇవి 2,300 వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కేంద్రాలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో బెంగళూరు ముందుంటే, ముంబై, ఢిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టైర్‌–2 పట్టణాలైన వైజాగ్, కాన్పూర్, గోవా, రాయిపూర్, భోపాల్, కోచి, పాట్నా, లక్నో, ఇండోర్‌ తదితర వాటిల్లో 650 కోవర్కింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు