వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు

10 Oct, 2020 09:04 IST|Sakshi

ఎగ్జిక్యూటివ్ ఘోర తప్పిదం, నెటిజన్ల మండిపాటు

సాక్షి, ముంబై:  ఫెస్టివ్ సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్  పేరుతో  వినియోగదారుల ముందుకొచ్చిన ప్రముఖ ఈకామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్ పై పెద్దదుమారం రేగుతోంది. అయితే ఆ తరువాత సంస్థ తరపున జరిగిన తీవ్ర తప్పిదానికి ఫ్లిప్‌కార్ట్  వినియోగదారులకు క్షమాపణలు  చెప్పింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ చేసింది ఘోర తప్పిదమంటూ నెటిజన్లు  మండిపడుతున్నారు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు)

వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్ సర్వీస్‌లు నాగాలాండ్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కొహిమాకు చెందిన ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇంకా స్వాతంత్ర్యం లభించలేదా.. తమ రాష్ట్రంలో ఎందుకు డెలివరీ చేయడం లేదని ప్రశ్నించారు. ఫ్లిప్‌కార్ట్ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి  ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగి ఇచ్చిన సమాధానమే దుమారానికి కారణమైంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు, కానీ తమ విక్రయదారులు ఇండియా బయట తమ సేవలను అందించలేరని పేర్కొన్నారు. ఈ సమాధానానికి షాకైన సదరు వినియోగదారులు తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఈ జవాబును తొలగించింప్పటికీ చాలామంది  దీని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.  

వావ్..నాగాలాండ్ కు ఫ్లిప్‌కార్ట్‌ స్వాతంత్ర్యం ఇచ్చేసిందని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నాగాలాండ్ భవిష్యత్తును ముందే ఊహించారంటూ ప్రఖ్యాత నాగా సంగీతకారుడు అలోబో చమత్కరించారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన ఈశాన్యరాష్ట్రం గురించి ఎంత తక్కువ మందికి తెలుసు అనేవిషయాన్ని హైలైట్ చేస్తోంది.. నాగాలాండ్ ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. దీనికి విద్యావ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలని తాను  భావిస్తున్నానన్నారు. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్‌తో కాకపోయినా, తనకూ ఇలాంటి అనుభవం ఎదురైదంటూ నాగాలాండ్ బోర్డర్స్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రూపిన్ శర్మ  పేర్కొన్నారు. నాగాలాండ్ ఇండియాలో భాగమన్నారు. ఈ వివాదంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ యూజర్లను క్షమాపణలు కోరింది. ఇలా జరిగినందుకు విచారిస్తున్నామని, సాంకేతికంగా జరిగిన పొరపాటని పేర్కొంది. నాగాలాండ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్ సేవలు అందిస్తుందని వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు