గంటన్నరలోనే నిత్యావసరాల డెలివరీ

29 Jul, 2020 04:57 IST|Sakshi

బెంగళూరులో ’ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌’ ప్రారంభం

నామమాత్రంగా రూ. 29 చార్జీ 

ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా సర్వీసులు

న్యూఢిల్లీ: దేశీ రిటైల్‌ మార్కెట్లో జియోమార్ట్, అమెజాన్‌డాట్‌కామ్‌లకు దీటైన పోటీనిచ్చే దిశగా ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా 90 నిమిషాల్లోనే నిత్యావసరాలు డెలివరీ చేసే కొత్త సర్వీసు ప్రారంభించింది. ’ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌’ పేరిట హైపర్‌లోకల్‌ డెలివరీ సేవలు ఆవిష్కరించింది. దీని ద్వారా తాజా కూరగాయలు, మాంసం, మొబైల్‌ ఫోన్లను గంటన్నర వ్యవధిలోనే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కర్వా మంగళవారం తెలిపారు. ముందుగా బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులు ఉంటాయని, క్రమంగా ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు పెద్ద నగరాలకు విస్తరిస్తామని ఆయన వివరించారు. ‘ఇంటి దగ్గరుండే కిరాణా దుకాణంలో ఉండే ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం వంటి కేటగిరీలు కూడా చేర్చాం.

విక్రేతలు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన భారీ గిడ్డంగుల్లాంటివి కూడా ఏర్పాటు చేశాం‘ అని కర్వా వివరించారు. హైపర్‌లోకల్‌ డెలివరీ విభాగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామన్నారు. ఇందుకోసం నాణ్యత, సర్వీస్‌ ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చే స్థానిక స్టోర్స్‌తో చేతులు కలపనున్నట్లు వివరించారు. అలాగే, నింజాకార్ట్, షాడోఫ్యాక్స్‌ వంటి కంపెనీలతో గల భాగస్వామ్యాన్ని కూడా ఈ సర్వీసుల కోసం ఉపయోగించుకోనున్నట్లు కర్వా చెప్పారు. షాడోఫ్యాక్స్‌ భాగస్వామిగా బెంగళూరులో సేవలు ప్రారంభించామని, తమ సొంత లాజిస్టిక్స్‌ విభాగం ఈకార్ట్‌ సర్వీసులు కూడా దీనికి ఉపయోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు.   

2,000 పైచిలుకు ఉత్పత్తులు.. 
తొలి దశలో నిత్యావసరాలే కాకుండా స్టేషనరీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు, మొదలైన 2,000 పైచిలుకు ఉత్పత్తులను అందిస్తామని కర్వా తెలిపారు. కొనుగోలుదారులు తమ అవసరాన్ని బట్టి తదుపరి 90 నిమిషాల స్లాట్‌ లేదా 2 గంటల స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఉదయం 6 గం.లు మొదలుకుని అర్ధరాత్రి దాకా సర్వీసులు ఉంటాయని, నామమాత్రంగా రూ. 29 డెలివరీ చార్జీలు ఉంటాయని కర్వా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు