ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ భారీ విస్తరణ

20 Aug, 2021 03:27 IST|Sakshi

డిసెంబర్‌ నాటికి 2,700 పట్టణాలకు

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ (హోల్‌సేల్‌ వర్తకుల కొనుగోళ్ల వేదిక/బీటుబీ) భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంతోపాటు, లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, కిరాణా స్టోర్ల యజమానుల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి 2,700 పట్టణాలకు విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ వ్యాపారం 2020 సెప్టెంబర్‌లో మొదలు కాగా.. 2021 మొదటి ఆరు నెలల్లో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూసింది. కిరాణా స్టోర్లు, రిటైలర్లు ఈ కామర్స్‌ కొనుగోళ్ల వైపు అడుగులు వేయడం ఈ వృద్ధికి మద్దతునిచ్చింది. ఇక ఈ ఏడాది ద్వితీయ భాగంలో (జూలై–డిసెంబర్‌) 180% వరకు హోల్‌సేల్‌ వ్యాపారం వృద్ధి చెందుతుందని ఫ్లిప్‌కార్ట్‌ అంచనా వేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ బీటుబీ వేదికపై సరఫరాదారుల సంఖ్య కూడా వృద్ధి చెందుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సరఫరాదారులు 58% పెరగొచ్చని అంచనా వేసింది. ఇది స్థానిక వ్యాపార సంస్థల వృద్ధికి, జీవనోపాధికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. వాల్‌మార్ట్‌కు చెందిన ‘బెస్ట్‌ప్రైస్‌’ను 2020లో ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేయడం తెలిసిందే. దీన్నే ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌గా పేరు మార్చుకుని విస్తరణపై దృష్టి సారించింది. కరోనా మహమ్మారి ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ కిరాణా సంస్థల నుంచి మంచి మంచి మద్దతును చూస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ పేర్కొన్నారు. డిజిటైజేషన్‌ ప్రయోజనాలను వారు చవి చూస్తున్నారని.. ఈ కామర్స్‌పై కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ సాయంతో స్థానిక సరఫరాదారుల వ్యవస్థ బలోపేతానికి, జీవనోపాధి పెంపునకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు