ఫ్లిప్‌కార్ట్‌ నష్టం రూ. 3,150 కోట్లు

2 Dec, 2020 10:54 IST|Sakshi

గతేడాది ఆదాయం రూ. 34,610 కోట్లు

అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం వృద్ధి

2019-20లో 18 శాతం తగ్గిన నష్టాలు

ముంబై, సాక్షి: ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గత ఆర్థిక సంవత్సర(2019-20) ఫలితాలు ప్రకటించింది. గ్లోబల్‌ రిటైల్‌ కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ గతేడాది రూ. 12 శాతం అధికంగా రూ. 34,610 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ కాలంలో నష్టాలను సైతం 18 శాతంమేర తగ్గించుకోగలిగింది. రూ. 3,150 కోట్లకు పరిమితం చేసుకోగలిగింది. అంతక్రితం ఏడాదిలో రూ. 4,455 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ అందించిన వివరాల ప్రకారం ఫ్లిప్‌కార్డ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(సింగపూర్‌)కు గతేడాది రూ. 4,455 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కాగా.. గతేడాది మొత్తం వ్యయాలు రూ. 37,760 కోట్లకు చేరాయి. వీటిలో ఉద్యోగుల(బెనిఫిట్‌) వ్యయాలు రూ. 246 కోట్ల నుంచిరూ. 309 కోట్లకు పెరిగాయి. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇతర ప్రాంతాలకూ
సెప్టెంబర్‌లో టోకు విక్రయాలకుగాను ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ పేరుతో డిజిటల్‌ బీటూబీ ప్లాట్‌ఫామ్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశపెట్టింది. తద్వారా స్థానిక కిరాణా, చిన్న, మధ్యతరహా దుకాణదారులకు రిటైలర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా వీటి ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్‌ను డిజిటైజ్‌ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్రధానంగా ఫుట్‌వేర్, దుస్తులు తదితర ఫ్యాషన్‌ రిటైలర్లకు అనుగుణంగా హోల్‌సేల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఈకామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తెలియజేసింది. తొలి దశలో గురుగ్రామ్‌, ఢిల్లీ, బెంగళూరులలో ఏర్పాటు చేయగా.. ఇకపై మరో 20 పట్టణాలకూ సర్వీసులను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక దశలో రెండు నెలల్లో 300 మంది వ్యూహాత్మక భాగస్వాములు, 2 లక్షల ప్రొడక్టుల లిస్టింగ్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది జులైలో వాల్‌మార్ట్‌కు దేశీయంగా గల బెస్ట్‌ప్రైస్‌ హోల్‌సేల్‌ స్టోర్లతోసహా ఇతర బిజినెస్‌లనూ ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా దిగ్గజ కంపెనీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అమెజాన్ తదితరాలతో ఎదురవుతున్న పోటీలో నెగ్గుకు వచ్చేందుకు సన్నద్ధమైనట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు