90 నిమిషాల్లో డెలివరీ!

28 Jul, 2020 14:25 IST|Sakshi

90 నిమిషాల్లో డెలివరీ

‘ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌’పేరుతో బెంగళూరులో ప్రారంభం

త్వరలోనే మరో 6 నగరాల్లో

సాక్షి, బెంగళూరు : ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌   90 నిమిషాల్లో డెలివరీ సేవలను  మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’  పేరుతో బెంగళూరులో 90 నిమిషాల డెలివరీని తాజాగా ప్రారంభించింది. త్వరలోనే మరో 6 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ క్విక్‌లో కిరాణా, ఫ్రెష్, డెయిరీ, మీట్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్, స్టేషనరీ ఐటమ్స్, హోమ్ యాక్సెసరీస్ వంటి విభాగాలలో దాదాపు 2 వేలకు పైగా ఉత్పత్తులు మొదటి దశలో అందుబాటులో ఉంటాయి. ఈ కామర్స్‌ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో  వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

వినియోగదారులు 90 నిమిషాల్లో ఆర్డర్ చేయడానికి లేదా 2 గంటల స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా ఆర్డర్లు ఇవ్వవచ్చు. ఉదయం 6 నుండి అర్ధరాత్రి మధ్య డెలివరీ ఉంటుంది. కనీస డెలివరీ ఫీజు 29 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఇది భారతదేశానికి ఒక గొప్ప మోడల్, స్థానిక కిరాణా దుకాణాలకు ప్రోత్సాహంతోపాటు, కొత్త వ్యాపార వ్యూహాలు, ఒప్పందాలకు అవకాశం కల్పిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఉపాధ్యక్షుడు సందీప్ కార్వా అన్నారు. 

ఫ్లిప్‌కార్ట్ నియర్‌ బై  పేరుతో  90 నిమిషాల కిరాణా డెలివరీ సేవను 2015 లో పరీక్షించింది. అయితే  పెద్దగా ఆదరణ లభించకపోవడంతో  ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 2016ల  రద్దు చేసింది. కాగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభ కాలంలో ఆన్‌లైన్‌ సేవలకు విపరీతమైన డిమాండ్‌ కారణంగా వినియోగదారులకు ఆకర్షించేందుకు  ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు