ఒడిదుడుకులు కొనసాగవచ్చు

14 Feb, 2022 06:25 IST|Sakshi

ప్రపంచ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు కీలకం 

ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు అంచనాలపై దృష్టి 

నేడు డబ్ల్యూపీఐ, రిటైల్‌ ద్రవ్యోల్బణ డేటా విడుదల

ఈ వారం మార్కెట్‌పై స్టాక్‌ నిపుణుల అభిప్రాయం

ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కీలక వడ్డీరేట్ల పెంపు భయాల నేపథ్యంలో స్టాక్‌ సూచీలు ఈ వారంలోనూ తడబడవచ్చని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పోరేట్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు.

దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికల అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ఆందోళనలతో గతవారంలో మొత్తంగా సెన్సెక్స్‌ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి  

‘‘గత నాలుగు నెలలుగా మార్కెట్లో స్థిరీకరణ కొనసాగుతోంది. ఇప్పటికీ నిర్ణయాత్మక దిశను ఎంచుకోలేకపోయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఆందోళనలు, రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. నిఫ్టీకి సాంకేతికంగా దిగువస్థాయిలో 17050 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. ఎగువస్థాయిలో 17,550–17,650 వద్ద శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెచ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి  
టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్‌ డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి, అమెరికా జనవరి రిటైల్‌ అమ్మకాలు ఈనెల 16న (బుధవారం) వెల్లడికానున్నాయి. యూఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌ గురువారం విడుదల అవుతాయి. జపాన్‌ జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు ఈనెల 18న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు.

కార్పొరేట్‌ ఫలితాలు
దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం చివరి దశకు చేరుకుంది. కోల్‌ ఇండి యా, ఐషర్‌ మోటార్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, స్పైస్‌ జెట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్, అం బుజా సిమెంట్స్, నెస్లేలతో సహా బీఎస్‌ఈలో నమోదైన 1,000కు పైగా కంపెలు ఈ వారంలో తమ డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు.

ద్రవ్యోల్బణ ఆందోళనలు  
అంతర్జాతీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం మార్కెట్ల వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ఈ మార్చి కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్యపాలసీని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాయి.   

గురువారం ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడి  
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ మినిట్స్‌ గురువారం వెల్లడికానున్నాయి. ద్రవ్యపాలసీ, ద్రవ్యోల్బణంతో సహా అర్థిక వ్యవస్థ పనితీరుపై ఫెడరల్‌ ఓపెన్‌ మా ర్కెట్‌ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్‌ ఈక్విటీ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి.

తారాస్థాయికి రష్యా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు
రష్యా ఉక్రెయిన్‌ దేశాల మధ్య భౌగోళిక సరిహద్దు వివాద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యా ఈనెల 16న ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం ఇచ్చాయి. యూఎస్‌తో సహా పలు దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని కోరుతున్నాయి.  

ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
ఈ ఫిబ్రవరి తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.14,935 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.10,080 కోట్లను, డెట్‌ విభాగం నుంచి రూ.4,830 కోట్లను, హైబ్రిడ్‌ సిగ్మెంట్‌ నుంచి రూ.24  కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్‌ ఇండియా ఎండీ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని వార్తలు