ఫ్లయింగ్‌ ట్యాక్సీలు.. కేవలం మూడు నిమిషాల్లో కారు నుంచి విమానానికి!

30 Nov, 2021 11:14 IST|Sakshi

ది జెట్‌సన్స్‌ అనే  ఓ అమెరికన్‌ యానిమేషన్‌ సిరీస్‌ ఉంటుంది. 60వ దశాబ్దంలో సూపర్‌ హిట్‌ అయిన సిట్‌కామ్‌ ఇది. గాల్లో ఎగిరే వాహనాల ఊహకు ఒక రూపం తెచ్చింది ఈ సిరీస్‌. మరి ఇదంతా రియల్‌గా జరుగుతుందా?
 

గాల్లో ఎగిరే కార్లు ఈ టెక్నాలజీ గురించి దశాబ్దంపై నుంచే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ముందడుగు వేశాయి కూడా. కానీ, ఆచరణలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చని భావించారంతా. ఈ తరుణంలో ఫ్రాన్స్‌ ఓ అడుగు ముందుకేసింది. 2024 ప్యారిస్‌ సమ్మర్‌ ఒలింపిక్స్ కోసం ఎగిరే ట్యాక్సీల సేవలను ఉపయోగించాలనుకుంటోంది. 

భారీ సైజులో ఉండే ఎలక్ట్రిక్ డ్రోన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్రీడాభిమానుల కోసం ఉపయోగించబోతున్నారు. వీటిద్వారా ప్రేక్షకులను క్రీడాసమరాలు జరిగే ఒక వేదిక నుంచి మరో వేదికకు తీసుకెళ్తారు. అంతర్జాతీయ ఈవెంట్లకు జనాలు క్యూ కడుతున్న(సగటున 60 లక్షల మంది టికెట్లు కొంటున్నారు.కానీ, కరోనాకి ముందు లెక్కలు ఇవి) తరుణంలో.. బిజీ నగరం ప్యారిస్‌ ట్రాఫిక్‌ ఇక్కట్లను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు 30 ఎయిరోనాటిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు టెస్ట్‌ ఫ్లైట్స్‌ నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. ప్యారిస్‌లోని కార్‌మెల్లెస్‌ ఎన్‌ వెక్సిన్‌లోని పోంటాయిస్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెస్ట్‌ ఫ్లైట్స్‌ కేవలం ఒలంపిక్స్‌ కోసం మాత్రమేనని, భవిష్యత్తులో వీటిని పూర్తి స్థాయిలో వినియోగించాలనే ప్రతిపాదనతో తమకేం సంబంధం లేదని ఒలింపిక్స్‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ టెస్ట్‌ ఫ్లైట్‌ ఈవెంట్‌లో స్లోవేకియాకు చెందిన క్లెయిన్‌ విజన్‌ ఎయిర్‌కార్‌ కేవలం మూడు నిమిషాల్లో కారు నుంచి విమానంగా మారిపోయి అమితంగా ఆకట్టుకుంది. 

ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్‌ కంపెనీ 2020లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లైయింగ్‌ కారును విజయవంతంగా పరీక్షించింది. అయితే వీటిని 2023లోనే మార్కెట్‌లోని తెచ్చే యోచనలో ఉంది. ఇక సంప్రదాయ కార్ల కంపెనీలు హుండాయ్‌, రెనాల్ట్‌ కూడా ఎయిర్‌స్పేస్‌ రేసులో అడుగుపెడుతున్నాయి.  ఫ్లైయింగ్‌ కార్లను మార్కెట్‌లోని తేవాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి.

చదవండి: మెషిన్‌ అరుస్తోంది అక్కడ.. నిజం చెప్పు

మరిన్ని వార్తలు