ఊహించని విధంగా స్పందించిన నిర్మలా సీతారామన్‌.. నెటిజన్ల మెచ్చుకోలు

9 May, 2022 11:56 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్‌ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్‌ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చుండూరు పద్మజా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్‌కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్‌ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్‌ సిబ్బందికి సూచించారు.  ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. 

పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్‌ వెంటనే తన దగ్గరున్న బాటిల్‌లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు  అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మలా సీతారామన్‌ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్‌ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్‌ అందించారు. 

చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం

మరిన్ని వార్తలు