పీఎస్‌యూలను పటిష్టం చేసేందుకే డిజిన్వెస్ట్‌మెంట్‌

11 Jun, 2022 11:02 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) కేంద్రం వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) అనేది ఆయా సంస్థలను మరింత సమర్థమంతంగా మార్చేందుకు ఉద్దేశించినదే తప్ప వాటి మూసివేతకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 1994–2004 మధ్య కాలంలో ప్రైవేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం ప్రొఫెనల్స్‌ సారథ్యంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

దీపం సదస్సులో
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో  వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. మరింత పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తిని పెంచగలిగి, సమర్థంగా నడిపించగలిగే వారి చేతికి అప్పగించాలనేదే సంస్థల ప్రైవేటీకరణ వెనుక ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా వాటాల విక్రయం కోసం ఐడీబీఐ బ్యాంక్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్, వైజాగ్‌ స్టీల్, ఎన్‌ఎండీసీ తదితర అరడజను సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఎయిరిండియాలో వాటాల విక్రయం సహా ప్రైవేటీకరణ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 13,500 కోట్లు సమీకరించింది.  

చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!

మరిన్ని వార్తలు