అక్రమ రుణ యాప్‌లకు చెక్‌!

10 Sep, 2022 04:32 IST|Sakshi

కట్టడికి పటిష్ట చర్యలు...

అధికారులతో సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: డిజిటల్‌ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్‌ బ్యాంక్‌ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ  (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్‌బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

వీటి ప్రకారం మనీ లాండరింగ్‌ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్‌ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది.
 
ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్‌ చేసే బాధ్యత కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్‌ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు, ఆర్‌బీఐ డిçప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రుణాల యాప్‌లు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన తదితర అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు