నవంబర్‌ 15న సీఎంలు, ఆర్థిక మంత్రులతో వర్చువల్‌ భేటీ! చర్చకొచ్చే కీలకాంశాలు ఏవంటే..

13 Nov, 2021 10:13 IST|Sakshi

FM Nirmala Sitharaman to interact with CMs of states:  దేశంలో భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 15వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. ఫైనాన్స్‌ సెక్రటరీ టీవీ సోమనాథన్‌ ఈ విషయాన్ని తెలిపారు. కోవిడ్‌–19 సృష్టించిన ఆర్థిక అనిశ్చితి వాతావరణం నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ వెర్చువల్‌ సమావేశం ఢిల్లీ వేదికగా జరుగుతోంది.  

కీలక సవాళ్లపై చర్చ 
రాష్ట్ర స్థాయిలో సమస్యలు, అవకాశాలు, సవాళ్లపై 15వ తేదీ సమావేశం ప్రధానంగా దృష్టి పెడుతుందని సోమనాథన్‌ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వాల మూల ధన వ్యయ సామర్థ్యాలపై దృష్టి సారిస్తుందని వివరించారు. ‘ప్రభుత్వ వైపు నుండి మూలధన వ్యయాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ రంగం వైపు నుండి సానుకూల సెంటిమెంట్‌ ఉంది, అయితే భారీగా మరిన్ని వాస్తవ పెట్టుబడులు రావాలి. క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాలను పరిశీలిస్తే, భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి’’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సానుకూల సెంటిమెంట్‌ భారతదేశాన్ని ఉన్నత, స్థిరమైన వృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి దోహదపడుతుందని  ప్రభుత్వం విశ్వసిస్తోందని అన్నారు. ఇది మనం వదులుకోకూడని అవకాశం అని అని సోమనాథన్‌ అన్నారు.

రాష్ట్రాల పాత్రా కీలకమే! 
ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కూడా భారత్‌కు సానుకూల వాతావారణం ఉందన్నారు. అటు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం భారత్‌ సొంతమని వివరించారు. ‘‘ఈ నేపథ్యంలో భారతదేశాన్ని అధిక వృద్ధికి తీసుకెళ్లడానికి ప్రైవేట్‌ రంగం ద్వారా తీసుకోవలసిన చర్యలు ఉన్నాయి. అలాగే  ప్రభుత్వం తీసుకోవలసిన విధానపరమైన చర్యలు ఉన్నాయి. కొన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ఈ దిశలో చర్యలు తీసుకుంటోంది. అయితే భారతదేశాన్ని స్థిరమైన ఉన్నత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవసరమైన పలు చర్యలను రాష్ట్రాలూ తీసుకోవాల్సి ఉంది ’’అని ఆయన అన్నారు. కాగా, చర్చించాల్సి ఉన్న రాష్ట్ర స్థాయి అంశాల్లో భూ సంస్కరణలు, జల వనరులు, విద్యుత్‌ లభ్యత, పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న అంశాలు ఉన్నాయని మరో ట్వీట్‌లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు