ఆర్థిక వ్యవస్థకు బూస్టర్‌ డోస్‌..!

29 Jun, 2021 01:23 IST|Sakshi

రూ. 6.29 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ

కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ గ్యారంటీ స్కీమ్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పొడిగింపు

చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు రూ. 23 వేల కోట్లు

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు.

వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్‌లు, టూరిస్ట్‌ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్‌ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది.

► 11 వేల మంది టూరిస్ట్‌ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు..
పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్‌ గ్యారంటీ స్కీమ్‌ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్‌ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని  ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్‌ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్‌ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు.

► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్‌ వీసా
అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్‌ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్‌ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది.

► హెల్త్‌కేర్‌ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు..
కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ (ఎన్‌సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్‌ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్‌ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది.

► ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పొడిగింపు
ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్‌ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్‌ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్‌ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది.

► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు
ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు.  

► మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు
మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది.

► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన
చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్‌ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్‌ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు.

► డీఏపీపై అదనపు సబ్సిడీ...
డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది.  నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు.

► ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన  పొడిగింపు
కోవిడ్‌ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్‌ ఆమోదించింది.

► ఇతరత్రా 8 సహాయక చర్యలు
♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు..
♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ
♦ నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి.
♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు.
♦ పంచాయతీలకు నెట్‌ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు.
♦ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ (పీఎల్‌ఐ) 2025–26 వరకు పొడిగింపు.
♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది.
♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం.

ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్‌ ఇన్‌ఫ్రాలో ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘
– నరేంద్ర మోదీ, ప్రధాని

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్‌ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్‌ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘
– ప్రతాప్‌ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌
 
వృద్ధికి ఊతం..
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్‌డౌన్‌లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్‌ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది.

మరిన్ని వార్తలు