అన్నింటికీ ఒక్కటే కేవైసీ

21 Sep, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘‘సెంట్రల్‌ కేవైసీ కోసం సెంట్రల్‌ రిపాజిటరీ ఉంది. అయితే, ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించాం. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది’’అని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్‌ 2022 కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.

బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్‌ మార్కెట్లకు ఉమ్మడి కేవైసీ విధానంపై ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ మధ్య గత వారం సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు మంత్రి సీతారామన్‌ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్‌ మరింత డిజిటైజ్‌ అవుతుందన్నారు.  

ప్రభుత్వం, ఫిన్‌టెక్‌ సంస్థల మధ్య సయోధ్య పెరగాలి
ప్రభుత్వం, ఫిన్‌టెక్‌ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని ఆమె సూచించారు. ‘దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుంది. కాబట్టి దూరం తగ్గించుకోవాలి. ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాలి. ఎంత తరచుగా సంప్రదింపులు జరిగితే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు.

గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎఫ్‌ఎఫ్‌) 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిశ్రమ, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం నెలకొనేలా చూసేందుకు తీసుకోతగిన చర్యలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. చర్చించేందుకు, ఐడియాలను పంచుకునేందుకు ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్‌ అధికారులు అందరూ కూడా సదా అందుబాటులోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీని రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేస్తుందని వివరించారు.  ఫిన్‌టెక్‌ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరీక్షించుకునేందుకు, ఫలితాలను బట్టి వాటిని విస్తరించేందుకు ఆర్‌బీఐ రూపొందించిన శాండ్‌బాక్స్‌ విధానం తోడ్పడుతోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.  

2022–23లో 7 శాతం వృద్ధి 
భారత్‌ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల నేపథ్యంలో క్రితం 8 శాతం అంచనాలను ఒకశాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ బాగుందని పేర్కొన్న ఆయన, ఈ దిశలో అన్ని స్తాయిల్లో మరింత సమన్వయ చర్యలు అవసరమని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో అన్నారు.  కోవిడ్‌ అనంతర సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధికి విఘాగంగా ఉన్నాయని అన్నారు.

చదవండి: క్రెడిట్‌,డెబిట్‌ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్‌!

మరిన్ని వార్తలు