సంపన్న దేశాల చర్యల ప్రతికూలతలపై చర్చ

2 Nov, 2022 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న చర్యల వల్ల ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి సమిష్టి ప్రయత్నాలపై భారతదేశం జీ20 వేదికగా దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అలాగే క్రిప్టో అసెట్స్‌పై ప్రపంచవ్యాప్త నియంత్రణపై భారత్‌ తగిన ప్రయత్నం చేస్తుందన్నారు. ఉగ్రవాదానికి నిధులు నిలిపివేతలో ఈ చర్య ఎంతగానో దోహపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుత్లో ఏ ఒక్క దేశమో క్రిప్టో ఆస్తులను నియంత్రించజాలదని ఇక్కడ జరిగిన ఐసీఆర్‌ఐఈఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌) జీ20 (14వ వార్షిక అంతర్జాతీయ) సమావేశంలో  స్పష్టం చేశారు.  

డిసెంబర్‌ నుంచి భారత్‌ నేతృత్వం నేపథ్యం 
భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్‌ మందగమనం వంటి  అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్‌ డిసెంబర్‌ 1వ తేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది.   2023 నవంబర్‌ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్‌ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న  దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.   జీ20 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 85 శాతంకాగా, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం. ప్రపంచంలో మూడింట రెండవంతు (దాదాపు 70 శాతం) జనాభాకు ఈ దేశాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

 జీ20కి సంబంధించి ఐసీఆర్‌ఐఈఆర్‌ మంగళవారం నిర్వహించిన సమవేశంలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు బెడిసికొట్టాయా అన్న ప్రశ్నకు ఈ సందర్భంగా ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, భారత్‌ అధ్యక్షతన జీ20లో ఇదీ ఒక చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల మందగమన పరిస్థితుల వల్ల ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనావేసింది.

2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్‌ అంచనావేసింది  ఇక ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఇటీవల తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్‌ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది.  ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్‌సహా పలు వర్థమాన దేశాలకు డబ్ల్యూటీఓ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో

ఐసీఆర్‌ఐఈఆర్‌ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు.. 
►  జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలుగా భారత్‌ ఎనిమిది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రపంచబ్యాంక్, ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సహా బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థల్లో సంస్కరణలు, ఆహార, ఇంధన భద్రతలు ఇందులో ప్రధానమైనవి.  
► ముఖ్యంగా ఐఎంఎఫ్‌ కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని భారత్‌ స్పష్టం చేస్తోంది.  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని భారత్‌ ఉద్ఘాటిస్తోంది.  
►  ఐఎంఎఫ్‌ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్‌ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్‌ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్‌ 15వ తేదీలోపు ముగియాలి.  వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్‌ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది.  
►  భారత్‌ ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చే కోణంలో చాలా పటిష్టంగా ఉంది. దేశ ఆర్థిక మూలాధారాలు బాగానే ఉన్నాయి.  
► అయితే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలలో జరిగే అనూహ్య, అసాధారణ పరిణామాలకు ప్రభావితం అవుతున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.  
►  అభివృద్ధి చెందుతున్న, మధ్య–దిగువ స్థాయి ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న ప్రతికూలతపై జీ20 వేదికగా భారత్‌ తన వాదనలను వినిపిస్తుంది. 

ఆర్థిక ఒడిదుడుకులు కూడా..
జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యతల్లో క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణతోపాటు, ద్రవ్యోల్బణం తత్సబంధ  ఆర్థిక ఒడిదుడుకు లు, సంబంధిత పరిణామాలపైనా భారత్‌ దృష్టి సారిస్తుంది. అలాగే అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వృద్ధి ఆకాంక్షలను– వాతావరణ పరిగణనలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది.    – సీఈఏ అనంత నాగేశ్వరన్‌

చదవండి: ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్‌!

మరిన్ని వార్తలు