హెచ్‌యూఎల్‌ లాభం రూ. 1,974 కోట్లు

21 Oct, 2020 04:40 IST|Sakshi

పుంజుకుంటున్న డిమాండ్‌

రూ. 14 మధ్యంతర డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిమాండ్‌ పుంజుకుంటోందనడానికి సూచనగా కంపెనీ లాభాలు, ఆదాయాలు పెరిగాయి. క్యూ2లో హెచ్‌యూఎల్‌ రూ. 1,974 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,818 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 9 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో అమ్మకాలు రూ. 9,931 కోట్ల నుంచి సుమారు 16 శాతం పెరిగి రూ. 11,510 కోట్లకు పెరిగాయి. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో హెచ్‌యూఎల్‌ మొత్తం వ్యయాలు రూ. 7,885 కోట్ల నుంచి రూ. 9,054 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14 మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు హెచ్‌యూఎల్‌ ప్రకటించింది. ‘సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మేం లాభదాయక వృద్ధి నమోదు చేశాం.  పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేయడం కొనసాగిస్తాం‘ అని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు. గడ్డు పరిస్థితులు గట్టెక్కినట్లేనని వ్యాఖ్యానించారు. తమ కార్యకలాపాలు మళ్లీ కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓ మోస్తరుగానే ఉందని మెహతా చెప్పారు.  

విభాగాలవారీగా చూస్తే..
ఫుడ్, రిఫ్రెష్‌మెంట్‌ వ్యాపార విభాగం అమ్మకాలు క్యూ2లో దాదాపు 83 శాతం ఎగిశాయి. హోమ్‌కేర్, సౌందర్య .. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు మళ్లీ కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరాయి. గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కి చెందిన హెల్త్‌ డ్రింక్స్‌ (హార్లిక్స్‌ మొదలైనవి) కూడా పోర్ట్‌ఫోలియోలో చేరడం సంస్థ ఆదాయాలకు ఊతమిచి్చంది. హార్లిక్స్‌తో కలిపితే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధి నమోదు చేసింది. బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేరు స్వల్ప నష్టంతో రూ. 2,172 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు