బాదుడే..బాదుడు!సామాన్యులకు మరో షాక్, ముందే కొనిపెట్టుకోండి..వీటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయ్‌!

23 Mar, 2022 14:23 IST|Sakshi

న్యూఢిల్లీ: బిస్కెట్లు మొదలుకుని నూడుల్స్‌ వరకు పలు ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల రేట్లు మళ్లీ పెరగనున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్‌ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

డాబర్, పార్లే వంటి కంపెనీలు ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. ‘పరిశ్రమలో ధరలు 10–15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం‘ అని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. ప్రస్తుతం కమోడిటీల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున.. రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పడం కష్టమేనని ఆయన చెప్పారు. పామాయిల్‌ రేటు లీటరుకు రూ.180కి ఎగియగా.. ప్రస్తుతం రూ.150కి తగ్గింది. అటు ముడిచమురు ధరలు బ్యారెల్‌కి 140 డాలర్లకు పెరిగినా.. మళ్లీ 100 డాలర్ల దిగువకి వచ్చాయి. అయినా ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయని షా పేర్కొన్నారు.  

ఆచితూచి నిర్ణయం.. 
కోవిడ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్లను భారీగా పెంచే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని షా చెప్పారు. క్రితం సారి కూడా కంపెనీలు ధరల పెంపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపై బదలాయించకుండా కొంత మేర తామే భరించినట్లు వివరించారు. ‘అందరూ దాదాపు 10–15 శాతం మేర పెంపు గురించి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ముడి వస్తువుల ధరలు అంతకుమించి పెరిగిపోయాయి‘ అని షా చెప్పారు. 

పార్లే విషయానికొస్తే ప్రస్తుతానికి తమ వద్ద ప్యాకేజింగ్‌ మెటీరియల్స్, ఇతర ఉత్పత్తుల నిల్వలు తగినంత స్థాయిలో ఉన్నాయని, నెలా రెణ్నెల్ల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోందని డాబర్‌ ఇండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అంకుశ్‌ జైన్‌ తెలిపారు. ‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, తత్ఫలితంగా ధరల పెంపు కారణంగా వినియోగదారులు తమ పర్సులను తెరవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు.  మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల భారాన్ని అధిగమించేందుకు క్రమంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం‘ అని ఆయన చెప్పారు.

ఇప్పటికే పెంపు..
హెచ్‌యూఎల్, నెస్లే ఇప్పటికే రేట్లను పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్నందువల్ల అవి ధరలను సత్వరం పెంచగలుగుతున్నాయని పేర్కొన్నాయి.‘హెచ్‌యూఎల్, నెస్లే వంటి వాటికి ధరలను నిర్ణయించే విషయంలో కాస్తంత ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కాఫీ, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ భారాన్ని అవి వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరో విడత 3–5 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అవనీష్‌ రాయ్‌ చెప్పారు. 

కొన్ని వర్గాల కథనాల ప్రకారం హెచ్‌యూఎల్, నెస్లే మొదలైన సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడం కోసం టీ, కాఫీ, నూడుల్స్‌ వంటి ఉత్పత్తుల రేట్లను ఇప్పటికే పెంచేశాయి. బ్రూ కాఫీ, బ్రూక్‌బాండ్‌ టీ మొదలైన వాటి రేట్లను హెచ్‌యూఎల్‌ పెంచింది. అలాగే నెస్లే ఇండియా కూడా తమ మ్యాగీ నూడుల్స్‌ రేటును 9–16 శాతం మేర పెంచింది. అటు పాల పౌడరు, కాఫీ పౌడర్‌ ధరను కూడా పెంచినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా వ్యయాలను కట్టడి చేసుకోవడం, ఆదా చేసుకోదగిన అంశాలపై కసరత్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఇంకా భారం పడుతుంటే దాన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వస్తోందని కంపెనీల వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు