గ్రామీణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు డౌన్‌!

8 Jul, 2021 06:37 IST|Sakshi

గతేడాది స్థాయిలో ఉండకపోవచ్చు

విప్రో కన్జూమర్‌కేర్‌ అంచనా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా ఉండకపోవచ్చంటూ విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ప్రకటించింది. కరోనా రెండో దశ కారణంగా జూన్‌ త్రైమాసికంలో ఎన్నో సవాళ్లను చూశామని.. పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ విక్రయాలు నిదానించొచ్చని ఈ సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పట్టణ మార్కెట్లలో విక్రయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్నాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఒకే మాదిరి విక్రయాలు ఉండొచ్చని విప్రో కన్జూమర్‌కేర్‌ అంచనా వేసింది. పామాయిల్‌ ధరలు కాస్త శాంతించడంతో సంతూర్‌ సబ్బుల ధరలు పెరుగుతాయని భావించడం లేదని తెలిపింది. సబ్బుల తయారీలో పామాయిల్‌ను ముడిపదార్థంగా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది మార్చి, జూన్‌లో రెండు పర్యాయాలు మొత్తం మీద 8 శాతం వరకు సబ్బుల ధరలను విప్రో కన్జూమర్‌ పెంచడం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు జోరుగా నడుస్తుండడంతో.. ఈకామర్స్‌ కోసమే ఉత్పత్తులను తీసుకురానున్నట్టు విప్రో తెలిపింది. ఆన్‌లైన్‌లో పెరిగిన విక్రయాలు ఇక ముందూ కొనసాగుతాయని అంచనా వేస్తున్నట్టు విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ఈడీ వినీత్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘‘గతంలో మాదిరి కాకుండా ఈ విడత గ్రామీణ ప్రాంతాలు సైతం కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కనుక అమ్మకాల్లో వృద్ధి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకేలా ఉండొచ్చు. దేశీయ ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో విప్రో 17.3 శాతం వృద్ధిని నమోదు చేసింది’’ అని అగర్వాల్‌ వివరించారు.

మరిన్ని వార్తలు