ఎన్నికల ఫలితాలు, యుద్ధ పరిణామాలు కీలకం

7 Mar, 2022 06:16 IST|Sakshi

ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగవచ్చు

క్రూడాయిల్‌ ధరల కదలికలపై దృష్టి 

తెరపైకి ద్రవ్యోల్బణ భయాలు

నేడు ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడి

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణుల అంచనాలు

ముంబై: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, కమోడిటీ ధరల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. చమురు ధరలు దశాబ్దపు గరిష్టానికి చేరిన నేపథ్యంలో క్రూడ్‌ సంబంధిత షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఎఫ్‌ఐఐలు పెద్ద మొత్తంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లను అమ్మేస్తున్నారు. అయితే మెటల్, ఐటీ, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు జరగొచ్చు. యుద్ధ భయాలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో నాలుగు రోజులే ట్రేడింగ్‌ జరిగిన గత వారంలో సెన్సెక్స్‌ 1,525 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

‘‘ఈ వారంలోనూ స్టాక్‌ సూచీల ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు ఏ కొంత తగ్గుముఖం పట్టినా.., షార్ట్‌ కవరింగ్‌ బౌన్స్‌బ్యాక్‌ జరుగొచ్చు. గతవారంలో నిఫ్టీ   ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ప్రతిసారి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అలాగే ప్రతిట్రేడింగ్‌లోనూ గ్యాప్‌ అప్‌తో మొదలైంది. నిఫ్టీ ప్రస్తుతానికి దిగువస్థాయిలో 16,200 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమై న నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ యష్‌ షా తెలిపారు   

ఎన్నికల ఫలితాల ప్రభావం
ఏడు విడుతల్లో దాదాపు నెలరోజులు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి పదోతేది(గురువారం) వెల్లడి అవుతాయి. కీలక రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూస్తే స్వల్పకాలం పాటు మార్కెట్‌  ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎన్నికల ఫలితాల ప్రభావితం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

యుద్ధ పరిణామాలు  
రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుంటే ఉక్రెయిన్‌ ధీటుగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడిని నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఫలితంగా సరఫరా భయాలతో క్రూడాయిల్‌ సహా కమోడిటీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్‌ చమురు ధర 120 డాలర్లకు ఎగబాకింది. క్రూడ్‌ ధరలు భగ్గుమనడంతో దిగుమతులపైనే 80 శాతం ఆధారపడిన భారత్‌కు వాణిజ్య లోటు మరింత పెరుగుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.  

ద్రవ్యోల్బణ భయాలు  
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో చమురు ధరలు పదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో గోధుమ, పాయిల్, కోల్‌ ధరలు సైతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరలు ఆకాశానికి ఎగుస్తున్న తరణంలో తాజాగా ద్రవ్యోల్బణ భయాలు తెరపైకి వచ్చాయి. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి చర్యలను మరింత కఠినం చేయొచ్చనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి.

స్థూల ఆర్థిక గణాంకాలు  
కేంద్ర గణాంకాల శాఖ నేడు దేశీయ ఫిబ్రవరి పారిశ్రామిక, ఉత్పాదక ఉత్పత్తి గణాంకాలను విడుదల చేయనుంది. అంతర్జాతీయంగా చూస్తే., రేపు యూరోజోన్‌ నాలుగో క్వార్టర్‌ జీడీపీ అంచనా గణాంకాలు,  బుధవారం చైనా ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా, గురువారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనలు వెలువడునున్నాయి. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణంకాల ప్రకటన ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించే అవకాశముంది.

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి
విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుంచి మార్చి మొదటి మూడు రోజుల్లోనే రూ. 17,537 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌ఐఐలు నెల 2–4 తేదీల మధ్య ఈక్విటీల నుండి రూ. 14,721 కోట్లు, డెట్‌ విభాగం నుండి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్‌ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో డెట్‌ విభాగంలోనూ ఎఫ్‌పీఐలే అమ్మకందారులుగా ఉంటూ వస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిందని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు