మొండి బకాయిలపై దృష్టి

21 Jun, 2022 04:16 IST|Sakshi
ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ ఖరాద్‌ అధ్యక్షతన బ్యాంకింగ్‌ వార్షిక సమావేశం

బ్యాంకింగ్‌కు ఆర్థికశాఖ పిలుపు

ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కీలక వార్షిక సమావేశం  

న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారం, రుణ వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థికశాఖ కీలక వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించాల్సి ఉండగా,  ఇతర కీలక కార్యక్రమాల వల్ల ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

దీనితో సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ ఖరాద్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఫైనాన్షియల్‌ సేవల కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా, ఆర్థికశాఖ ఇతర సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ఎండీ, సీఈఓలు పాల్గొన్న ఈ సమావేశం వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల పనితీరు, పురోగతిపై చర్చించింది. ముఖ్యంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్, ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) పథకాలపై సమావేశం చర్చించింది. బ్యాంకింగ్‌కు అవసరమైన మూలధన సమకూర్చడం, దేశంలో అందరికీ ఆర్థిక సేవలు వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

భారత్‌కు సవాళ్లను తట్టుకునే సామర్థ్యం
ఇదిలాఉండగా, భారత్‌ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, సుస్థిర ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడం, దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌ లోటు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికశాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఉందని కూడా నివేదిక భరోసాను ఇచ్చింది. తోటి వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు