జొమాటో నుంచి ఫుడ్‌ ఒక్కటే కాదు ఇవి కూడా

10 Jul, 2021 11:22 IST|Sakshi

త్వరలో యాప్‌ ద్వారా విక్రయాలు 

గ్రోఫర్స్‌లో పెట్టుబడుల నేపథ్యం 

గ్రోసరీలో భారీ అవకాశాలపై కన్ను 

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో త్వరలో గ్రోసరీ విక్రయాలను ప్రారంభించనుంది. యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ విక్రయాలకు తెరతీయనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అక్షంత్‌ గోయల్‌ పేర్కొన్నారు. రూ. 9,375 కోట్ల సమీకరణకు ఈ నెల 14 నుంచి పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. కంపెనీ ఇటీవలే ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్‌లో 10 కోట్ల డాలర్లు(రూ. 745 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది.

దేశీయంగా గ్రోసరీ విభాగంలో భారీ అవకాశాలున్నట్లు ఈ సందర్భంగా గోయల్‌ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రోసరీ బిజినెస్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విభాగంలో మరింత విస్తరించే యోచనతోనే గ్రోఫర్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. జొమాటో యాప్‌ ద్వారా త్వరలోనే ఆన్‌లైన్‌ గ్రోసరీ విక్రయాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. వచ్చే వారం ప్రారంభంకానున్న జొమాటో ఐపీవోకు రూ. 72–76 ప్రైస్‌ బ్యాండ్‌ను ప్రకటించిన విషయం విదితమే.  

భారీ విలువ
పబ్లిక్‌ ఇష్యూ తదుపరి జొమాటో విలువ రూ. 64,000 కోట్లను అధిగమించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్‌ విలువలో జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌(రూ. 41,000 కోట్లు), బర్గర్‌ కింగ్‌ ఇండియా(రూ. 6,627 కోట్లు)లను వెనక్కినెట్టే వీలున్నట్లు అంచనా వేశారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం భారీ వృద్ధిలో సాగుతోంది. ఈ విభాగంలో అధిక మార్కెట్‌ వాటాను సాధించేందుకు జొమాటో, స్విగ్గీ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 2019–20లో జొమాటో రూ. 2,960 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అయితే రూ. 2,200 కోట్లమేర నిర్వహణ(ఇబిటా) నష్టం నమోదైంది. 
 

మరిన్ని వార్తలు