ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం కోసం ఎంఎస్‌ఎంఈని ప్రోత్సహించండి

3 Dec, 2022 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆహార ప్రాసెసింగ్‌ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్‌ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు.  పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య  (ఎంఎస్‌ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్‌ వేస్టేజ్‌ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్‌ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. 

మరిన్ని వార్తలు