ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం ఉమ్మడి పోర్టల్‌

23 Sep, 2022 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖలు అమలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి ఉమ్మడి పోర్టల్‌.. ఆహార శుద్ధి పరిశ్రమలో సూక్ష్మ యూనిట్లకు మేలు చేస్తుందని కేంద్ర ఆహార శుద్ధి శాఖ ప్రకటించింది. అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం, ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) పథకాలను ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ పథకాలు ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తాయన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంకేఎస్‌వై పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులు క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీకితోడు.. 3 శాతం వడ్డీ రాయితీ పొందొచ్చని ఆహార శుద్ధి శాఖ తెలిపింది. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద అందిస్తున్న 35 శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొంది. ఈ రెండు పథకాల కింద ప్రాజెక్టుల ఆమోదానికి దరఖాస్తులను ఏఐఎఫ్‌ ఎంఐఎస్‌ పోర్టల్‌ నుంచి స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది.

చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్‌ పెట్టిన మార్క్‌ జుకర్‌బర్గ్‌! 

మరిన్ని వార్తలు