దుబాయ్‌లో మిస్సయిన వాచీ.. అస్సాంలో రీకవరీ! ఇంతకీ వాచీ ప్రత్యేకతలేంటంటే..

11 Dec, 2021 14:28 IST|Sakshi

Maradona Stolen Watches Specialities And Cost: అర్జెంటీనా ఫుట్‌ బాల్‌ దిగ్గజం డిగో మారడోనా.. సాకర్‌ ప్రపంచంలో ఓ లెజెండ్‌. మరణం అనంతరం ఆయన లెగసీ కొనసాగుతోంది. అయితే ఆయనకు చెందిన కాస్ట్‌లీ వాచీ ఒకటి దుబాయ్‌లో చోరీకి గురికాగా.. ఎట్టకేలకు దానిని అస్సాం(అసోం)లో రికవరీ చేసుకున్నారు పోలీసులు. 


2010 ఫిఫా వరల్డ్‌ కప్‌ టైంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కాస్ట్‌లీ వాచ్‌ మేకింగ్‌ కంపెనీ హుబ్లోట్‌.. బిగ్‌బ్యాంగ్‌ మోడల్‌ పేరుతో మారడోనా గౌరవార్థం లిమిటెడ్‌ ఎడిషన్‌ రిలీజ్‌ చేసింది.  మొత్తం 250 వాచీలు తయారు చేయించగా.. క్షణాల్లో హాట్‌కేకుల్లా ఒక్కక్కటి భారీ ధరకు అమ్ముడుపోయాయి. వీటిలో రెండు వాచీలను మారడోనాకు గిఫ్ట్‌గా ఇచ్చింది హుబ్లోట్‌.    

2010 ఫిఫా వరల్డ్‌ కప్‌ సందర్భంగా మారడోనా ఈ రెండు వాచీలను(రెండుచేతులకు చెరోటి) ధరించి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపించారు. అందులో ఆయన విక్టరీ సింబల్‌ చూపించే ఫొటో(వెనకనుంచి), సంతకం, జెర్సీ నెంబర్‌ కూడా ఉంటాయి.  వీటి ధర ఒక్కొక్కటి రూ. 20 లక్షలుగా(మన కరెన్సీలో) ప్రకటించింది కంపెనీ. అయితే.. 

మారడోనా మరణానంతరం ఆయనకు చెందిన వస్తువులు కొన్నింటిని దుబాయ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ వేలంపాటలో చేజిక్కించుకుంది. ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజీద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి.. ఆ వాచీని దొంగిలించాడు. ఆపై తన తండ్రికి బాగోలేదని ఆగష్టులో భారత్‌(అస్సోం) వచ్చేశాడు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న దుబాయ్‌ పోలీసులు.. ఎట్టకేలకు అస్సోం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డీజీపీలు స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మరిన్ని వార్తలు