భారత్‌ ఆటోమొబైల్‌.. ‘అమ్మో’రికా! 

15 Sep, 2021 04:38 IST|Sakshi

అమెరికా వాహన కంపెనీల వరుస వైఫల్యాలు 

తాజాగా ఫోర్డ్‌ మోటార్స్‌ రివర్స్‌గేర్‌.. 

ఇప్పటికే హార్లే డేవిడ్సన్, జనరల్‌ మోటార్స్‌ పలాయనం...

వినియోగదారులకు చేరువ కాలేకపోయిన దిగ్గజాలు

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ అయిన భారత్‌లో.. అమెరికన్‌ కంపెనీలు రాణించలేక చతికిలపడుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం యూఎస్‌ బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. భారత్‌ మార్కెట్‌ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం.. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉండడం వాటి వైఫల్య కారణాల్లో ప్రధానమైనవి.

జనరల్‌ మోటార్స్‌ (చెవ్రోలెట్‌), హార్లే డేవిడ్సన్‌ నష్టాల కారణంగా భారత్‌ మార్కెట్‌ నుంచి నిష్క్రమించగా.. తాజాగా ఫోర్డ్‌ మోటార్స్‌ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లో దిగ్గజ బ్రాండ్లు కావడం గమనార్హం. దీంతో భారత ఆటో మార్కెట్‌ ప్రపంచ ఆటో దిగ్గజాలకు, ముఖ్యంగా అమెరికన్‌ కంపెనీలకు ఎందుకు మిస్టరీగా ఉంటోందన్న ప్రశ్న మరోసారి ఉదయించింది. ముందు అంచనాలు ఘనంగానే ఉంటాయి. కానీ భారత్‌ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా కంపెనీల అంచనాలు మారిపోతున్నాయి.

ఒక స్థాయికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు సాహసించడం లేదు. ఇదే మార్కెట్లో దక్షిణ కొరియా, జపాన్, ఆఖరుకు చైనా కంపెనీలు పోటీపడుతూ బలంగా చొచ్చుకుపోతుంటే.. అమెరికా కంపెనీలకే ఈ పరిస్థితి ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది. 

వృద్ధి బలహీనం
భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. దీనికితోడు 2010 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం మధ్య విక్రయాల్లో వార్షిక వృద్ధి 3.6 శాతం మించి లేదు. అంతకుముందు పదేళ్ల కాలంలో విక్రయాల్లో వృద్ధి 10 శాతంపైనే కొనసాగుతూ వచ్చింది. వృద్ధి బలహీనంగా> ఉండడం కూడా అమెరికా కంపెనీల కష్టాలకు కారణమేనని చెప్పుకోవచ్చు.

2011లో ఫోర్డ్‌ అత్యధికంగా 98,537 కార్లను విక్రయించగా.. అదే గరిష్టంగా మిగిలిపోయింది. ఇందులో సగం కార్లను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఒక్క నెలలోనే విక్రయిస్తుండడాన్ని పరిశీలించాలి. మారుతి సుజుకీ తర్వాత దేశీ కార్ల మార్కెట్లో హ్యుందాయ్‌ రెండో దిగ్గజంగా కొనసాగుతోంది.  

ఫలించని ఫోర్డ్‌ ప్రయత్నాలు 
ఫోర్డ్‌ మోటార్స్‌ 2019లో మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలసి జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఫోర్డ్‌కు 49 శాతం వాటా, మహీంద్రాకు మెజారిటీ వాటాను ప్రతిపాదించాయి. ఈ ప్రయత్నంతో అయినా నష్టాలకు చెక్‌పెట్టి.. లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఫోర్డ్‌ ఆశపడగా.. అది కూడా సఫలం కాలేదు. జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదన నుంచి రెండు సంస్థలు గతేడాది విరమించుకున్నాయి.

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత పదేళ్లలో రెండు బిలియన్‌ డాలర్లకు పైగా నష్టాలను (రూ.15వేల కోట్లు) మూటగట్టుకున్న ఫోర్డ్‌.. ఇక్కడ ఇక నెగ్గలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. ఫలితమే నిష్క్రమణ నిర్ణయం. ఖరీదైన బైక్‌లకు పేరొందిన హార్లేడేవిడ్సన్‌ కూడా 2020 సెప్టెంబర్‌లో భారత్‌ మార్కెట్‌లో ప్రత్యక్ష కార్యకలాపాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించడం గమనించాలి. విక్రయాలు ఆశించిన మేర లేకపోవడం, బైక్‌ల తయారీని స్థానికంగా చేపట్టకుండా దిగుమతులపైనే ఈ సంస్థ ఆధారపడడం ప్రతిబంధకాలుగా మారాయి.

దిగుమతి చేసుకునే బైక్‌లపై పన్నుల భారం అధికంగా ఉండడంతో.. దీన్ని తగ్గించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం పలు సందర్భాల్లో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు కూడా. అయినా ఆ ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గలేదు. దీంతో భారత్‌లో నేరుగా విక్రయ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు హార్లే డేవిడ్సన్‌ ప్రకటించింది. ఆ తర్వాత భారత్‌లో హార్లే డేవిడ్సన్‌ విక్రయాలు, సర్వీసు కోసం హీరో మోటోతో డీల్‌ కుదుర్చుకోవడం గమనార్హం.

సరైన వ్యూహాల్లేకపోవడం?
భారత కస్టమర్లు ‘వ్యాల్యూ ఫర్‌ మనీ’ చూస్తారు. తాము పెడుతున్న డబ్బుకు తగిన విలువ లభిస్తుందా? అని ఎక్కువ మంది పరిగణించే అంశం. అమెరికా దిగ్గజాలు.. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో మాదిరే భారత్‌లోనూ ‘బిగ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ (పెద్దదే ముద్దు) మంత్రం ఫలిస్తుందన్న అంచనాలు తప్పాయి. చిన్న కార్లు, తక్కువ ఖరీదున్న బైక్‌లకే ఇక్కడ పెద్ద మార్కెట్‌ అన్న సూక్ష్మాన్ని అవి గుర్తించలేకపోయాయి.

భారత్‌లో ప్రతీ 10 కార్లు, మోటారుసైకిళ్ల విక్రయాల్లో 7 బడ్జెట్‌ విభాగంలోనివే ఉంటున్నాయి. పైగా ఇతర మార్కెట్లలో మాదిరే ఉత్పత్తులు, మార్కెటింగ్‌ విధానాలు భారత్‌లో ఫలిస్తాయన్న అంచనాలూ సరికాదు. భారత కస్టమర్లు విక్రయానంతర సేవలనూ దృష్టిలో పెట్టుకుంటారన్నది నిజం. మారుతీ, హ్యాందాయ్, ఇటీవలే ప్రవేశించిన కియా మెరుగ్గా రాణించడానికి మార్కెట్‌నాడిని పట్టుకోవడం వల్లేనని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు.

‘‘జపాన్, కొరియా సంస్థల్లా కాకుండా.. ఇతర పాశ్చాత్య  వాహన కంపెనీలు బలహీన యాజమాన్య నిర్వహణ, భారత్‌ లో పోటీ విషయం లో బలహీన అంచనా లే అవి రాణించలేకపోవ డానికి కారణాలు’’ అని రెనో అండ్‌ స్కోడా భారత ఆపరేషన్స్‌కు గతంలో చీఫ్‌గా పనిచేసిన సుధీర్‌రావు చెప్పారు.

పన్నుల పాత్ర..
జీఎం, ఫోర్డ్, ఇతర అంతర్జాతీయ ఆటోమొబైల్‌ కంపెనీలు భారత్‌లో విజయం సాధించలేకపోవడం వెనుక పన్నుల పాత్ర కూడా ఉందని పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉన్న విషయాన్ని పేర్కొంటున్నారు. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.2 లీటర్ల సామర్థ్యం వరకు ఇంజన్లు కలిగిన కార్లపై జీఎస్‌టీ 28 శాతం, ఒక శాతం సెస్సు అమల్లో ఉంది. ఇంతకుమించి పొడవు, ఇంజన్‌ సామర్థ్యాలతో కూడిన కార్లపై పన్ను భారం 50% వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా పన్నుల విధానం లేదని టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. చిన్న కార్ల మోడళ్లను తీసుకొచ్చినా విక్రయాలు భారీగా ఉంటే తప్ప లాభసాటి కాదన్నారు. ‘టొయోటా ఒక్క ఇన్నోవా వాహనం విక్రయంపై వచ్చిన లాభాన్ని.. చిన్న కార్ల నుంచి తెచ్చుకోవాలంటే కనీసం 80 ఎటియోస్‌లను విక్రయించాల్సి ఉంటుంది’ అన్నారు. 

మరిన్ని వార్తలు