తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్లు

9 Mar, 2022 14:08 IST|Sakshi

క్యూ3లో ఎఫ్‌పీఐల యూటర్న్‌ 

2 శాతం పెట్టుబడులు వెనక్కి 

5.12 బిలియన్‌ డాలర్ల విలువైన విక్రయాలు 

జనవరి–ఫిబ్రవరి 4 మధ్య భారీ అమ్మకాలు  

న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో 2 శాతం క్షీణించాయి. దీంతో అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ 654 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. మార్నింగ్‌ స్టార్‌ నివేదిక ప్రకారం జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో ఇవి 667 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు భారీ విక్రయాలకు తెరతీయడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంది. ప్రధానంగా లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్స్‌లో అత్యధిక విక్రయాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి ఈక్విటీ మార్కెట్ల క్యాపిటలైజేషన్‌లో ఎఫ్‌పీఐల వాటా క్యూ3లో నమోదైన 19 శాతం నుంచి క్యూ4 కల్లా 18 శాతానికి నీరసించింది. కాగా.. 2020 డిసెంబర్‌కల్లా దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల వాటాల విలువ 518 బిలియన్‌ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం!  

అమ్మకాలకే ప్రాధాన్యం 
ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆఫ్‌షోర్‌ బీమా కంపెనీలు, హెడ్జ్‌ ఫండ్స్, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌తోపాటు ఆఫ్‌షోర్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం కీలక పాత్ర పోషిస్తుంటాయి. దేశీ ఈక్విటీలలో ఈ ఏడాది క్యూ2లో 56.34 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు క్యూ3లో యూటర్న్‌ తీసుకుని 5.12 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. నెలవారీగా చూస్తే అక్టోబర్‌లో 1.81 బిలియన్‌ డాలర్లు, నవంబర్‌లో 0.79 బిలియన్‌ డాలర్లు, డిసెంబర్‌లో మరింత అధికంగా 2.52 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక 2021 జనవరి–డిసెంబర్‌ కాలాన్ని పరిగణిస్తే నికరంగా 3.76 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే 2020 ఇదేకాలంలో ఏకంగా 8.42 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 

2022లో మరింత డీలా 
ఇక ప్రస్తుత కేలండర్‌ ఏడాది(2022)లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్ల కొనుగోలు నిలిపివేసేందుకు నిర్ణయించడంతోపాటు.. వడ్డీ రేట్ల పెంపువైపు దృష్టిపెట్టడంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కఠిన పరపతి విధానాలు అమల్లోకి రానున్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల బాండ్ల ఈల్డ్స్‌ జోరందుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి రిస్క్‌ అధికంగాగల ఆస్తుల నుంచి వైదొలగి పసిడివైపు మళ్లుతున్నట్లు తెలియజేసింది. వెరసి 2022లో ఫిబ్రవరి 4వరకూ ఎఫ్‌పీఐలు 4.95 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు తెలియజేసింది.

చదవండి : డెట్‌ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ

మరిన్ని వార్తలు