విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నుంచి రూ.12,000 కోట్లు

20 Sep, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–16 వరకు దేశీ ఈక్విటీల్లోకి నికరంగా రూ.12,084 కోట్ల పెట్టుబడులను జోప్పించారు. యూఎస్‌ ఫెడ్‌ సహా అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో దూకుడు తగ్గించుకుంటాయన్న అంచనాలే నికర పెట్టుబడులకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్‌ నెలలోనూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.51,200 కోట్లుగా ఉండగా, జూలైలో రూ.5,000 కోట్లు కావడం గమనార్హం.

వరుసగా తొమ్మిది నెలల పాటు భారత ఈక్విటీల్లో నికర విక్రయాల తర్వాత జూలై నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడుల బాట పట్టడం తెలిసిందే. అయితే, వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సమీప కాలంలో ఎఫ్‌పీఐ పెట్టుబడుల్లో ఆటుపోట్లు ఉండొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అన్నారు.

అనుకూలం
యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిదానంగా వెళ్లొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కాస్త శాంతించడంతో భారత ఈక్విటీలు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోవడం కంటే కొనసాగడమే మంచిదన్న అభిప్రాయంతో వారున్నట్టు తెలిపారు. ఇక ఈ నెలలో 16వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు డెట్‌ మార్కెట్లో నికరంగా రూ.1,777 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు.

చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే!
 

మరిన్ని వార్తలు