China vs India: కుదురుగా ఉంటే ఓకే.. లేదంటే సీన్‌ మారిపోద్ది

21 Oct, 2021 20:07 IST|Sakshi

భారత్‌, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తోంది. చైనా ఒంటెద్దు పోకడలను వీడకపోవడంతో ఇండియా సైతం ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అవుతోంది. 

అవి ఉండాల్సిందే
తాజాగా విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గురువారం జరిగిన లీవరేజింగ్‌ చైనాస్‌ ఎకనామి అనే సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకయితే చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయని. గతేడాదితో పోల్చితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం 49 శాతం పెరిగింది కూడా ఆయన తెలిపారు. అయితే ఇక ముందు వాణిజ్య సంబంధాలు ఇలాగే ఉంటాయనేందుకు గ్యారెంటీ లేదన్నారు శ్రింగ్లా. 1988 నుంచి భారత్‌ , చైనాల మధ్య సంబంధాలు సానుకూల పథంలోనే నడుస్తున్నాయి. ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలంటే ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని తేల్చి చెప్పారు.

మాదారి మేం చూసుకుంటాం
‘భారత్‌, చైనా మధ్య జరుగుతున్న వ్యాపారంలో ఎక్కువ శాతం చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులు ఇండియాకు దిగుమతి అవుతున్నాయి. దీని వల్ల చైనాకే ఎక్కువ లబ్ధి జరుగుతోంది. దీన్ని సరి చేయాలనే లక్ష్యంతోనే ఆత్మ నిర్భర్‌ భారత్‌ను అమలు చేస్తున్నాం. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నాం.  త్వరలోనే స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఎగుమతులు కూడా చేస్తాం’ అంటూ హర్షవర్థన్‌ అన్నారు.

బుద్ది మార్చుకోని డ్రాగన్‌
గతేడాది కోవిడ్‌ సంక్షోభానికి తోడు తూర్పు లదాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. దీంతో పలు చైనా బేస్డ్‌ యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఐనప్పటికీ ఇరు దేశాల మధ్య 88 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీల విలువ 91 బిలియన్‌ డాలర​‍్లకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుడుపడుతున్నాయని భావించే లోగానే ఇటు లాదాఖ్‌లో గల్వాన్‌ , అటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోయలో చైనా ఆగడాలు శృతి మించుతున్నాయి. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

గట్టిగానే
విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ తాజా వ్యాఖ్యలతో దేశ రక్షణ, శాంతి భద్రతల తర్వాతే వాణిజ్యమని ఇండియా స్పష్టం చేసినట్టయ్యింది. అంతేకాదు చైనాతో వాణిజ్యం విషయంలో  ఇండియా పునరాలోచనలో పడిందనే సంకేతాలను విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్‌ ఇచ్చినట్టయ్యింది.

చదవండి :చైనాలో భారీ కార్పొరేట్‌ పతనం తప్పదా?

మరిన్ని వార్తలు