ట్రావెల్‌ నౌ, పే లేటర్‌..ఎగిరిపోతే ఎంత బావుంటుంది: ప్రతి నెలా  బిలియన్‌ డాలర్లు

22 Feb, 2023 14:05 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెలా బిలియన్‌ డాలర్లను (రూ.8,200 కోట్లు) ఇందు కోసం వెచ్చిస్తున్నట్టు ఆర్‌బీఐ అవుట్‌వర్డ్‌ రెమిటెన్స్‌ డేటా స్పష్టం చేస్తోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది ఎంతో అధికం కావడం గమనార్హం. 2022-23 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల్లో లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ కింద వ్యక్తులు ప్రయాణాల కోసం 9.95 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేశారు. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో ఇలా వెచ్చించిన మొత్తం 4.16 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. ఇక కరోనా ముందు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాల కోసం చేసిన అవుట్‌వర్డ్‌ రెమిటెన్స్‌లు 5.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇక 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో అవుట్‌వర్డ్‌ రెమిటెన్స్‌లు 7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించు  
‘‘భారతీయులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వియత్నాం, థాయిలాండ్, యూరప్, దుబాయ్, బాలి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని వీ3ఆన్‌లైన్‌ పార్ట్‌నర్‌ సపన్‌ గుప్తా తెలిపారు. ప్రయాణ చార్జీలు అందుబాటులో ఉండడంతో పరిశ్రమ పెద్ద బూమ్‌ను చూస్తున్నట్టు సంకాష్‌ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ దహియా పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్లలో 5 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణాలను ఎంపిక చేసుకుంటున్నారు. యూరప్, బాలి, వియత్నాం, దుబాయి ప్రాంతాలకు భారతీయుల నుంచి డిమాండ్‌ ఉంది’’అని చెప్పారు. ‘ఇప్పుడు ప్రయాణించు-తర్వాత చెల్లించు’ అనే కాన్సెప్ట్‌కు పర్యాటకులు ఆకర్షితులవుతున్నట్టు దహియా తెలిపారు. నెలవారీ చెల్లింపులపైనా విదేశాలను చూసి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

మరిన్ని వార్తలు