రూపాయికి ఆర్‌బిఐ బూస్ట్‌

19 Jan, 2021 05:52 IST|Sakshi

మార్చి నాటికి 93 బిలియన్‌ డాలర్ల వ్యయం

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక

ముంబై: భారత్‌ రూపాయి పటిష్టానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి నాటికి మరో 20 బిలియన్‌ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్‌ బ్రోకరేజ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక విడుదల సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా ఎకనమిస్టులు ఇంద్రనిల్‌ సేన్‌ గుప్తా, ఆస్తా గోద్వానీ తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్‌– 2021 మార్చి)  ఇప్పటి వరకూ ఆర్‌బీఐ తన ‘ఫారెక్స్‌ ఇంటర్‌వెన్షన్‌’ ద్వారా రూపాయి బలోపేతానికి 73.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. మార్చి నాటికి మరో 20 బిలియన్‌ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉంది.  

ఫారెక్స్‌ నిల్వలు మరింత పెరిగే చాన్స్‌!
ఇక భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవడంపై కూడా ఆర్‌బీఐ దృష్టి సారిస్తుంది. జనవరి 15వ తేదీ ముగిసిన వారంలో భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు 586.1 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఇది లైఫ్‌టైమ్‌ హై కావడం గమనార్హం. దాదాపు 13 నెలల దిగుమతులకు ఈ నిధులు సరిపోతాయని అంచనా.  జూన్‌ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు అర ట్రిలియన్‌ మార్క్‌దాటి 501.70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ,  నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దిగుమతులకు సంబంధించి వ్యయాలు తగ్గడం ఫారెక్స్‌ నిల్వలు పెరగడానికి కారణాల్లో ఒకటి.  

రూపాయి @ 73.28  
మరోవైపు ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం 21 పైసలు బలహీనపడి 73.28 వద్ద ముగిసింది. బలహీన ఈక్విటీ మార్కెట్, అంతర్జాతీయంగా డాలర్‌ బలోపేత ధోరణి దీనికి నేపథ్యం. సోమవారం ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి 73.30 గరిష్ట–73.18 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. శుక్రవారం రూపాయి ముగింపు 73.07.  ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప పురోగతిలో  90.74 వద్ద ట్రేడవుతోంది (52 వారాల గరిష్టం 103.96. కనిష్టం 89.16). ఇక ఇదే సమయంలో రూపాయి విలువ స్వల్ప నష్టాల్లో 73.18 వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).   

2021–22లో 45 బిలియన్‌ డాలర్లు వెచ్చించే వీలు...
కాగా, దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ)  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.5 శాతంగా ఉన్న పక్షంలో 2021–22లో రూపాయి పటిష్టతకు 45 బిలియన్‌ డాలర్లను వెచ్చించే అవకాశం ఉందని కూడా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఎకనమిస్టులు అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు క్రూడ్‌ ధరలు సగటున బ్యారల్‌కు 50 డాలర్లు ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు అంచనావేశారు. 2008, 2013, 2018ల్లో రూపాయి విలువలో చోటుచేసుకున్న బలహీనతను తిరిగి చోటుచేసుకోకుండా ఆర్‌బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గత శనివారం నానీ పాల్కీవాలా సంస్మరణ సభలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్న నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తాజా నివేదిక విడుదల చేయడం గమనార్హం. డాలర్‌ బలహీనత కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ ఫారెక్స్‌ కొనుగోలును కొనసాగిస్తుందని, తద్వారా రూపాయి బలహీనపడకుండా చూస్తుందని విశ్వసిస్తున్నట్లు నివేదిక తెలిపింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ డిసెంబర్‌ నాటికి సగటున 70.5 గా ఉంటుందని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు