ఫారెక్స్‌ నిల్వల భారీ తగ్గుదల

23 Jul, 2022 13:05 IST|Sakshi

7.5 బిలియన్‌ డాలర్లు తగ్గి

573 బిలియన్‌ డాలర్లకు చేరిక  

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు ఏ వారానికావారం భారీగా తగ్గుతున్నాయి. జూలై 8తో 8.062 బిలియన్‌ డాలర్లు తగ్గి, 580.252 బిలియన్‌ డాలర్లకు పడిపోయిన భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 15వ తేదీతో ముగిసిన వారంలో మరో 7.541 బిలియన్‌ డాలర్లు తగ్గి 572.712 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల వంటి అంశాలు ఫారెక్స్‌ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది.  2021 సెపె్టంబర్‌ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్‌ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం.. 

అన్ని విభాగాల్లోనూ తగ్గుదలే... 
♦  డాలర్‌ రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ సమీక్షా వారంలో 6.527 బిలియన్‌ డాలర్లు తగ్గి 511.562 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
♦  పసిడి నిల్వలు 830 మిలియన్‌ డాలర్లు తగ్గి, 38.356 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. 
♦  ఐఎంఎఫ్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 155 మిలియన్‌ డాలర్ల తగ్గి 17.857 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
♦  ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థాయి కూడా 29 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.937 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

గవర్నర్‌ భరోసా 
కాగా, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడుతూ, దిగుమతులు,  రుణ సేవల అవసరాలు, పోర్ట్‌ఫోలియో అవుట్‌ఫ్లోల కారణంగా డిమాండ్‌కు సంబంధించి ఫారెక్స్‌ మార్కెట్‌లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్‌ బ్యాంకు మార్కెట్‌కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్‌ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు