యాపిల్‌ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!

2 Nov, 2022 13:48 IST|Sakshi

చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా  ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు. దొరికినంత దోచుకున్నాడు, అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు.  ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..  భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, కంపోనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఈ మోసం  2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు.

అలా కంపెనీలో 17 మిలియన్‌ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం) పైగా దోచుకున్నాడు. ఎట్టికేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్‌ కటకటాలపాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపగా.. ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సెన్,  డాన్ ఎమ్ బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14న ఉండనుంది.  అంతవరకు ప్రసాద్‌ పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది.

మరిన్ని వార్తలు