'మార్క్‌ జుకర్‌ బర్గ్‌ గురించి చాలామందికి తెలియని విషయం'

6 Jul, 2022 12:04 IST|Sakshi

మెటా అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారారు.ఫేస్‌బుక్‌ సంస్థ ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగుల్లో ఒకరైన నోహ్‌ కాగన్‌.. వర్క్‌ విషయంలో జుకర్‌ బర్గ్‌ తీరు గురించి మాట్లాడిన వీడియోలు ట్రెండ్‌ అవుతున్నాయి. ఉద్యోగుల పట్ల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారని, అలా జుకర్‌ బర్గ్‌ ఎందుకు చేస్తున్నారో తెలిసేది కాదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.    

మెటా కార్యాలయంలో  జపాన్‌కు చెందిన పురాతన కత్తిని(కటానా) మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఉపయోగించేవారు. ఫేస్‌బుక్‌లో  కోడింగ్‌, లేదంటే ఇతర వర్క్‌లు నచ్చకపోతే కటానా కత్తిని ఊపుతు తిరిగేవారంటూ టిక్‌ టాక్‌ వీడియోలో తెలిపాడు. 

జుకర్‌బర్గ్ కత్తి గురించి టిక్‌టాక్‌లో వీడియోలో కాగన్‌.."అతను గొప్ప ఇన్నోవేటర్‌. షెడ్యూల్‌ ప్రకారం వర్క్‌ కంప్లీట్‌ కాకపోతే జుకర్‌ బర్గ్‌ కటానా కత్తితో ఆఫీస్‌ అంతా తిరుగుతూ నేను చెప్పిన పని టైంకు పూర్తి చేయకపోతే మీ ముఖంపై కొడతాను. లేదంటే ఈ భారీ ఖడ్గంతో నిన్ను(ఉద్యోగులను ఉద్దేశిస్తూ)నరికివేస్తానంటూ' నవ్వులు పూయించేవారని అన్నాడు. ఈ రోజు వరకు, అతని వద్ద ఆ కత్తి ఎందుకు ఉందో నాకు తెలియదు." వర్క్‌లో ఎంత ఒత్తిడి ఎదురైనా చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉండేవారు. కానీ వర్క్‌ పూర్తి చేసే విషయంలో ఆ కత్తిని ఉపయోగిస్తారంటూ కాగన్‌ పలు ఆసక్తికర విషయాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

ఇదో చెత్త..మళ్లీ చేయి 
ప్రస్తుతం సాఫ్ట్‌ వేర్‌ డీల్స్ సంస్థ యాప్‌సుమో సీఈఓగా ఉన్న కాగన్ ఫేస్‌బుక్‌లో పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.కంపెనీకి సేవలందించిన 10 నెలలకే జుకర్‌ బర్గ్‌ తనని ఫేస్‌బుక్ నుండి తొలగించినట్లు తెలిపారు. 60వేల డాలర్ల జీతంతో పాటు కంపెనీలో 0.1 శాతం షేర్‌ను కోల్పోయినట్లు చెప్పాడు. సందర్భం ఎలా ఉన్నా జుకర్‌ బర్గ్‌ హ్యాండిల్‌ చేయగలడు. కానీ ఓసారి జుకర్‌ బర్గ్‌ తన సహనాన్ని కోల్పోయాడు. ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయాలని అనుకున్నాడు. అదే ఫీచర్‌పై పనిచేస్తున్న ఇంజనీర్‌ క్రిస్ట్‌ను గమనించాడు. ఫీచర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్లాస్‌తో వాటర్‌ విసిరేసి "ఇదో చెత్త..మళ్లీ చేయి"అంటూ జుకర్‌బర్గ్ అరుస్తూ వెళ్ళిపోయాడని కాగన్‌ తెలిపాడు.   

కాగా, 2005లో ఫేస్‌బుక్‌లో చేరిన కాగన్ జుకర్‌బర్గ్ కత్తి గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2014లో కాగన్‌ రాసిన బుక్‌లో "హౌ ఐ లాస్ట్ 170 మిలియన్ డాలర్స్: మై టైమ్ యాజ్ #30 ఎట్ ఫేస్‌బుక్" ఈవెంట్‌లో సైతం జుకర్‌ బర్గ్‌ వాడే కత్తి గురించి ప్రస్తావించాడు.

మరిన్ని వార్తలు