పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు! 

25 Mar, 2023 19:11 IST|Sakshi

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. పని ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నానని ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగిని చెప్పడం తాజాగా అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించి ‘ఇండిపెండెంట్‌’ అనే ఆన్‌లైన్‌ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్‌!

మెటా కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేసిన మాడెలిన్ మచాడో అనే మహిళ.. తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు (దాదాపు రూ. 1.5 కోట్లు) జీతం అందుకున్నట్లు చెప్పారు. 2021లో మెటా కంపెనీలో తన ఆరు నెలల ఉద్యోగ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్ వీడియోలో వెల్లడించారు. రిక్రూటర్‌గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్‌ చేయలేదని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో కంపెనీకి రిక్రూట్‌మెంట్‌ ఆలోచనే లేకపోవడం అని చెప్పారు.

మెటా కంపెనీలో రోజంతా నేర్చుకోవడంలోనే గడిచిపోయేదని, ఆ కంపెనీలో ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి ఇచ్చే శిక్షణ ఉన్నతంగా ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్లు లేకపోయినప్పటికీ టీమ్‌ మీటింగ్‌లు మాత్రం ఎక్కువగా ఉండేవని చెప్పారు. తన టీమ్‌లోని వారందరూ కొత్తవారే కావడంతో ఎవరూ ఎవరినీ రిక్రూట్ చేసుకోలేదని వివరించారు.

ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు!

ఏ పనీ చేయకుండానే జీతమిచ్చారని మచాడో చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత దీనిపై వివరణ ఇస్తూ లింక్డ్‌ఇన్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. తాను టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో తప్పు కోణంలో వైరల్ అయిందని, తన ఉద్దేశం వేరు అని వివరించారు.

కాగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మెటా ఇటీవల మరో విడత లేఆఫ్‌లను ప్రకటించింది. 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు పేర్కొంది. 5,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా వాటినీ ఆపేసింది. తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్‌లను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు