తెలంగాణలో త్వరలో ఫాక్స్‌కాన్‌ యూనిట్

6 Mar, 2023 14:35 IST|Sakshi

తైవాన్‌కు చెందిన యాపిల్‌ ఐఫోన్‌ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్‌ ఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ..తమ ఐఫోన్‌ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ చైర్మన్‌ యంగ్ లియూ మార్చి 2న సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను మాటిచ్చినట్లుగానే..రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌ ఫాక్స్‌కాన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు కేసీఆర్‌కు లేఖ రాశారు. తద్వారా లక్షమందికి ఉపాధి కలుగుతుందని అందులో పేర్కొన్నారు. 

కొంగరకలాన్ లో ప్లాంట్
సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు యంగ్ లియూ. రాష్ట్రాభివృద్ధి ప‌ట్ల కేసీఆర్‌ కు ఉన్న విజ‌న్ తనకు నచ్చిందన్నారు లియూ. వీలైనంత త్వరగా కొంగ‌ర క‌లాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌తంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు.  

రూ.3500 కోట్ల పెట్టుబడులు  
రంగారెడ్డి జిల్లా కొంగ‌ర‌క‌లాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీని నెలకొల్పనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించినట్లు సమాచారం.  

కర్ణాటకలో  ఒక ప్లాంటు 
తెలంగాణలో పెట్టుబడులపై ప్రకటన వెలువరించకముందు కర్ణాటకలో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఫాక్స్‌కాన్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో అక్కడ కూడా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాతే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్‌ సంస్థ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందని, ఆ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఎంఓయూ (MOU) కూడా పూర్తయిందని చెప్పిన బొమ్మై.. ఫాక్స్‌ కాన్‌ ప్లాంట్‌ కోసం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో దొడ్డబల్లాపూర్, దేవంగల్లి తాలూకా ప్రాంతంలో 300 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు