కొనసాగుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు

30 May, 2022 06:34 IST|Sakshi

మే నెలలో రూ. 39,000 కోట్ల అమ్మకాలు

డాలర్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లే కారణం

న్యూఢిల్లీ: డాలర్‌ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్‌ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఈక్విటీ రీసెర్చ్‌–రిటైల్‌) శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు.

‘ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్‌ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్‌పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగించారు.

ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్‌ కరెక్షన్‌కి లోను కావడంతో ఏప్రిల్‌ తొలి వారంలో ఎఫ్‌పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్‌ సెషన్లు మిగిలి ఉన్నాయి.

‘భారత్‌లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్‌ ఈల్డ్‌లు .. డాలర్‌ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్‌ కుమార్‌ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్‌స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు.  

మరిన్ని వార్తలు