ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల వాటా డౌన్‌

18 Aug, 2022 06:17 IST|Sakshi

క్యూ1లో 523 బిలియన్‌ డాలర్లకు

న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్‌స్టార్‌ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్‌లో ఈ విలువ 612 బిలియన్‌ డాలర్లుకాగా.. 2021 జూన్‌ క్వార్టర్‌కల్లా 592 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు.

దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్‌పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు 13.85 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్‌లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్‌ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు