Franklin Templeton: భారత మార్కెట్‌ను వదిలి వెళ్లేది లేదు 

28 Jul, 2022 02:42 IST|Sakshi

బ్రాండ్‌ బలోపేతం చేసుకుంటాం 

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ప్రకటన 

ముంబై: భారత మార్కెట్‌ నుంచి వెళ్లేది లేదని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థ స్పష్టం చేసింది. బదులుగా తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని ప్రకటించింది. భారత మార్కెట్‌ను వీడిపోవడాన్ని అవివేకంగా సంస్థ భారత ప్రెసిడెంట్‌ అవినాష్‌ సత్వలేకర్‌ అభివర్ణించారు. ఇతర విదేశీ సంస్థల మాదిరే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌ సైతం భారత మార్కెట్‌ నుంచి వెళ్లిపోవచ్చంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో, అటువంటిదేమీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ 26 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 20 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.56,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్నట్టు గుర్తు చేశారు. తమ కార్యకలాపాలు పూర్తిగా లాభదాయకంగా ఉన్నట్టు చెప్పారు. సంక్షోభం ఎదుర్కొంటున్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇండియా హెడ్‌గా సత్వలేకర్‌ మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు.

పంపిణీదారులు, ఉద్యోగులతో మమేకమై, ఇన్వెస్టర్లను చేరుకోనున్నట్టు చెప్పారు. 2020 మార్కెట్ల క్రాష్‌ సమయంలో రూ.25,000 కోట్ల ఆస్తులతో కూడిన ఆరు డెట్‌ పథకాలను మూసేస్తూ ఈ సంస్థ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో సెబీ జరిమానా విధించడంతోపాటు, కొత్త డెట్‌ పథకాల ఆవిష్కరణపై నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఈ సంస్థ శాట్‌లో సవాలు చేసింది.     

మరిన్ని వార్తలు